
రాయ్‌పూర్: చత్తీస్‌గడ్‌లో ఈ నెల 11వ తేదీన 11 ఏళ్ల బాలుడు సుమారు 60 నుంచి 80 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడ్డాడు. అప్పటి నుంచి రాష్ట్రమంతా ఆ ఘటన సంచలనంగా మారింది. ప్రతి గంట గంటకు అక్కడ ఏం జరిగిందా? అనే ఉత్కంఠ మొదలైంది. దీంతో జిల్లా కలెక్టరే కాదు.. ఏకంగా సీఎం భుపేశ్ భగేల్ కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకున్నారు. ఆ పిల్లాడిని రక్షించడానికి రెస్క్యూ సిబ్బందితో రొబాట్ టీమ్ కూడా చేరింది. బోరుబావిలో చిక్కుకున్న బాలుడికి ఆక్సిజన్ అందించడానికి ఎంతో ప్రయత్నం జరిగింది. నిన్న ఉదయం ఆ బాలుడికి అరటి పండు కూడా అందించారు. సుమారు 80 కంటే కూడా ఎక్కువ గంటలుగా చేపట్టిన ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ శ్రమ ఫలించింది. ఆ బాలుడు ప్రాణాలతో సజీవంగా ఈ రోజు ఆ బోరు బావి నుంచి బయటకు వచ్చాడు.
చత్తీస్‌గడ్‌లోని చంపా జిల్లా పిహ్రిడ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల రాహుల్ సాహు ఇంటి వెనుక పెరటిలోకి వెళ్లి ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ వాడకంలో లేని బోరుబావిలో పడ్డాడు. ఈ విషయం తెలియగానే ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్‌కు వెళ్లాయి. ఆ బాలుడిని రక్షించడానికి ఆ బోరుబావికి సమాంతరంగా జేసీబీతో పెద్ద కందకం తవ్వారు. ఓ వైద్యుల బృందం కూడా స్పాట్లకు చేరింది. ఆక్సిజన్ అందడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత రొబాట్ టీమ్ కూడా వీరితో కలిసింది. రాహుల్ సాహును కాపాడటానికి రెస్క్యూ సిబ్బంది అహర్నిశలు శ్రమించారు.
ఈ రెస్క్యూ గురించి జిల్లా కలెక్టర్ జితేంద్ర శుక్లా ఎప్పటికప్పుడు వివరాలను సీఎం భుపేశ్ భగేల్‌కు చేరవేశారు. సీఎం భుపేశ్ భగేల్ కూడా ప్రతి విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 150 మంది సిబ్బంది ఈ స్పాట్‌లో ఉన్నారు. సీఎం భుపేశ్ భగేల్ వీడియో కాల్ ద్వారా పరిస్థితులు కనుక్కుంటూనే ఉన్నారు.
సీఎం భగేల్.. రాహుల్ సాహు కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. రాహుల్ సాహును తప్పకుండా సజీవంగా బయటకు హామీ ఇచ్చారు. రెస్క్యూ సిబ్బందిపై నమ్మకం ఉంచాలని వివరించారు. రాహుల్ సాహును రక్షించడానికి రొబాట్ టీమ్‌ను పంపించామని, అధికారులకు కావాల్సిన అన్ని వనరులను సమకూర్చామని పిల్లాడి తండ్రికి సీఎం చెప్పారు.
జూన్ 11న బోరుబావిలో పడ్డ రాహుల్ సాహును ఈ రోజు ఉదయం రెస్క్యూ సిబ్బంది ఆయనను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగింది. పిల్లాడి ఆరోగ్య బాగానే ఉన్నట్టు కలెక్టర్ జితేంద్ర శుక్లా తెలిపారు.