బొమ్మైని ఎన్నుకోలేదు.. డబ్బు తీసుకుని సీఎంను చేశారు: సిద్ధా రామయ్య సంచలన ఆరోపణలు

Published : May 08, 2022, 07:12 PM IST
బొమ్మైని ఎన్నుకోలేదు.. డబ్బు తీసుకుని సీఎంను చేశారు: సిద్ధా రామయ్య సంచలన ఆరోపణలు

సారాంశం

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా, సీఎం బసవరాజు బొమ్మైని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్దా రామయ్య దాడి చేశాడు. అసలు బసవరాజు బొమ్మై ఎన్నికైన సీఎం కాదని, ఎంపికైన సీఎం అని వివరించారు. డబ్బులు తీసుకుని ఆయనను సీఎం చేశారని ఆరోపించారు.  

బెంగళూరు: కర్ణాటక ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ సీఎం సిద్దా రామయ్య ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైని ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేయలేదని అన్నారు. కానీ, డబ్బులు తీసుకుని సీఎం కుర్చీ అప్పగించారని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే బాసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన ఆరోపణలు చేసిన రోజుల వ్యవధిలో సిద్దా రామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కర్ణాటక సీఎంగా బసవరాజు బొమ్మైని ఆర్ఎస్ఎస్ చేసిందని, అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ సూచనలనే అమలు చేస్తున్నాడని సిద్దా రామయ్య అన్నారు. ‘బసవరాజు బొమ్మై ఎన్నికైన సీఎం కాదు. కానీ, నియమించిన ముఖ్యమంత్రి. అందుకే ఆయన ఏమీ చేయటం లేదు. సీఎం కావడానికి ఆయన డబ్బులు ఇచ్చుకున్నాడు. అందుకే ఆయన పని చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. ఆయన వరకు.. ఆర్ఎస్ఎస్ సూచనలు అమలు చేస్తే చాలు’ అని సిద్దా రామయ్య అన్నారు.

ఈ ప్రభుత్వం నాలుగేళ్ల అధికారంలో ఒక్క కుటుంబానికి కూడా పక్కా ఇల్లును కల్పించలేకపోయిందని మండిపడ్డారు. అలాంటి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉన్నదా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఇందుకు సిగ్గుపడాలి అని విమర్శించారు. తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సుమారు 15 లక్షల ఇళ్లను నిర్మించానని చెప్పారు.

ఇదిలా ఉండగా, తరుచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాసనగౌడ పాటిల్ యత్నాల్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది పవర్ బ్రోకర్లు ఢిల్లీ నుంచి తన వద్దకు వచ్చారని వివరించారు. రాష్ట్ర సీఎం కావాలంటే రూ. 2,500 కోట్లు ఇవ్వాలని, ఆ మొత్తం అందిస్తే రాష్ట్ర సీఎంగా అవుతారని ఆఫర్ ఇచ్చారని తెలిపారు. బెలగావి జిల్లాలోని రామదుర్గ్‌లో పంచమశాలి కమ్యూనిటీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ
వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ నుంచి కొందరు బ్రోకర్లు తన వద్దకు వచ్చారని, వారికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చాలా దగ్గర అని చెప్పారని పేర్కొన్నారు. రూ. 2,500 కోట్లు ఇస్తే తనను సీఎంగా చేసి కూర్చోబెడతామని నమ్మబలికారన్నారు. కానీ, తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించానని, అసలు రూ. 2,500 కోట్టు అంటే ఎన్ని నోట్లు ఉంటాయో కూడా తనకు తెలియదని, అంతటి డబ్బును ఎవరైనా ఎక్కడ పెడతారని అడిగానని చెప్పారు.

కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ వెంటనే ఆయన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రూ. 2,500 కోట్లకు సీఎం కుర్చీ, రూ. 100 కోట్లకు సీఎం పదవి ఇస్తారని ఆయన పేర్కొన్నారని వివరించారు. యత్నాల్ మాజీ కేంద్రమంత్రి అని, ఆయన మాటలను సింపుల్‌గా తీసుకోరాదని కోరారు.

ఈ ఆఫర్ వ్యాఖ్యలే కాదు.. అన్ని పార్టీల టాప్ నేతలు ఒకరి కోసం మరొకరు అడ్జస్ట్ అయ్యే పాలిటిక్స్ చేసుకుంటారని బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప, కాంగ్రెస్ సీనియర్లు సిద్దారామయ్య, డీకే శివకుమార్, జేడీఎస్ నుంచి దేవేగౌడ, హెచ్‌డీ కుమారస్వామిలు పరస్పరం ఒకరికొకరు పరోక్షంగా సహకరించుకుంటారని తెలిపారు. వారిలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఒకరికి మరొకరు అనుకూలంగా వ్యవహరించుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని తాను అసెంబ్లీలో కూడా చెప్పానని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !