
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ కెమికల్ ఫాక్టరీ జాతీయ రాజధాని న్యూ ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్రామిక కేంద్రంలో ఉంది. ఈ ఫాక్టరీలో శనివారం సాయంత్రం ఒక్క సారిగా బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పోలీసు ప్రతినిధి సురేంద్ర సింగ్ ‘రాయిటర్స్’కు తెలిపారు. ఈ ఫాక్టరీ CNG పంప్‌కు ఆనుకుని ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
వారణాసిలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసు.. 16 ఏళ్ల తర్వాతి దోషి నిర్దారణ.. 6న శిక్ష ఖరారు
పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయి. ఫ్యాక్టరీలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి మూడు గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలియజేశారు. ‘‘ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా పాల్గొంటోంది. ’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహాయం అందించాలని కోరారు. అలాగే క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.
అయితే ఈ అగ్నిప్రమాదం సంభవించిన ఫ్యాక్టరీలో పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. దీనిపై హాపూర్ డీఎం మేధా రూపమ్ స్పందించారు. ఆ ఫ్యాక్టరీలో పేలుడు పదార్థాలు తయారు అవుతున్నాయో లేదో విచారణ జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫోరెన్సిక్ బృందాలు ఇక్కడికి చేరుకుని నమూనాలను సేకరిస్తున్నాయని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతీ ఫ్యాక్టరీ అనుమతుల మేరకు నడుస్తున్నాయా లేదా అనే దానిపై విచారణ జరుపుతామని అన్నారు. విచారణలో అధికారులు లేదా ఎవరైనా తప్పు చేసి ఉన్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూడటం ప్రస్తుతం తమ కర్తవ్యమని తెలిపారు. బాధితుల్లో కొందరిని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ కు తరలించామని రూపమ్ చెప్పారు. సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని మీరట్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.