
Karnataka hijab row: కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజుకో ములుపు తిరుగుతోంది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేదం విధించడంతో నిరసనోద్యమం తీవ్రతరమైంది. ఈ వివాదంలో సుప్రీం, హై కోర్టులు సైతం వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఆంశానికి రాజకీయరంగు పులుముకుంది. మరోవైపు.. కర్ణాటకలో హిజాబ్ వివాదం హింసాత్మకం కావడం వెనుక పాకిస్తాన్, ఖలిస్తాన్ ప్రేరిత శక్తుల ప్రమేయం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే హిజాబ్ వివాదం బీజేపీ మతోన్మాదం వల్లే తలెత్తిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తాజాగా ఈ వివాదంపై పీడీపీ అధినేత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. హిజాబ్ అంశాన్ని కర్ణాటక బీజేపీ వివాదస్పదం చేస్తుందని మండిపడ్డారు. బిజెపి ఒక్క హిజాబ్‌తో ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింల చిహ్నాలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని, అన్నింటిని తొలగిస్తారంటూ దుయ్యబట్టారు.
భారతీయ ముస్లింలకు భారతీయుడిగా ఉంటే సరిపోదనీ, బీజేపీ వ్యక్తులై ఉండాలని ఎద్దేవా చేశారు. ఇదే తరుణంలో.. జమ్మూ కాశ్మీర్‌లో నెలకొన్న సమస్యలను కూడా ఆమె ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ రాజకీయ అంశం అయితే వారు (బీజేపీ) దానిని కమ్యూనిటీ అంశంగా మార్చాలనుకుంటున్నారని ముఫ్తీ అన్నారు.ఎన్నికల్లో ప్రయోజనాలను పొందడానికి బిజెపి పరిస్థితిని పోలరైజ్ చేయాలనుకుంటోందనీ, ముస్లిం బాలికలను చదువుకు దూరం చేసే కుట్రలా కనిపిస్తోందనీ, డ్రెస్ కోడ్ సంస్కృతిలో భాగమని అన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా హిజాబ్ వివాదంపై స్పందించారు. ఈ వివాదాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పుల్వామాలో మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరికీ వారి ఇష్టానుసారం దుస్తువులను ధరించే, తినే హక్కు ఉంది. వారికి నచ్చిన మత విశ్వాసాలను ఆచరించడానికి స్వేచ్ఛ ఉంది. అయితే.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం ద్వారా ఎన్నికలను గెలవాలనే ప్రయత్నంలో కొన్ని రాడికల్ ఎలిమెంట్స్ ఒక మతంపై దాడి చేస్తున్నాయి, ”అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.