బైపోల్స్‌లో దూసుకెళ్లిన బీజేపీ.. ఏడింట నాలుగు స్థానాలు కమలం కైవసం.. ఫలితాలపై టాప్ పాయింట్స్ ఇవే

By Mahesh KFirst Published Nov 6, 2022, 8:14 PM IST
Highlights

దేశవ్యాప్తంగా జరిగిన ఏడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లను గెలుచుకుంది. ఫలితంగా ఏడు స్థానాల్లో నాలుగు సీట్లు గెలుచుకుని బీజేపీ హవా చాటింది. కాగా, కాంగ్రెస్ తన రెండు స్థానాలనూ కాపాడుకోలేకపోయింది. ఇందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్ అదనంగా గెలుచుకున్నాయి.
 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 3వ తేదీన ఉపఎన్నిక జరిగింది. ఈ ఏడు స్థానాల్లో ఉపఎన్నికలకు ముందు బీజేపీ మూడు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు, శివసేన, ఆర్జేడీలవి ఒక్కో స్థానం. కానీ, ఇక్కడ భిన్న కారణాల రీత్య ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ మూడు స్థానాలకు బదులు నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకుని ఈ ఉపఎన్నికలో పై చేయి సాధించింది.

ఉత్తరప్రదేశ్‌లో గోలా గోక్రాన్నాథ్, హర్యానాలోని ఆదంపూర్, బిహార్‌లోని గోపాల్‌గంజ్, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేపీ విజయపతాక ఎగరేసింది. కాగా, బిహార్‌లోని మొకామాలో ఆర్జేడీ, తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్‌, మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఈస్ట్ ఆంధేరీలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీలు గెలిచాయి.

నిజానికి ఆర్జేడీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలు వాటి స్థానాల్లో తిరిగి గెలుచుకుని సీటును కాపాడుకున్నాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ ఉపఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన రెండు స్థానాలనూ నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ రెండు స్థానాలనూ కోల్పోయి.. ఈ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయిన పార్టీగా మిగిలింది. కాగా, ఈ రెండు స్థానాలను మునుగోడులో టీఆర్ఎస్, హర్యానాలో బీజేపీ గెలుచుకుంది.

Also Read: ఉపఎన్నిక‌లో ఆగిన అఖిలేష్ యాద‌వ్ సైకిల్.. యూపీలో ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఇవే.. !

ఈ రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బీజేపీలో చేరడంతో ఉపఎన్నిక వచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఫలితంగా వచ్చిన ఉపఎన్నికల్లో ఆయన తన స్థానాన్ని కాపాడుకోలేకపోయారు. కానీ, ఆ ఉపఎన్నికను గెలుచుకుని టీఆర్ఎస్ మరో సీటు పెంచుకుంది. హర్యానాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది.

కానీ, హర్యానాలో ఆదంపూర్ నియోజకవర్గం మాజీ సీఎం భజన్ లాల్ కుటుంబానికి కంచుకోట. ఆయన తనయుడు కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. కుల్దీప్ బిష్ణోయ్ కొడుకు భవ్య బిష్ణోయ్‌ను బీజేపీ టికెట్ పై బరిలోకి దింపాడు. ఇక్కడ భవ్య బిష్ణోయ్ గెలిచాడు. తద్వారా బీజేపీ అదనంగా సీటు గెలుచుకోవడమే కాదు.. భవ్య బిష్ణోయ్ తాత నుంచి వస్తున్న రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోగలిగాడు.

Also Read: మునుగోడు బైపోల్ 2022: 15వ రౌండ్ లో కూసుకుంట్లదే హవా

బిహార్‌లో ఆర్జేడీకి ఆదరణ తగ్గలేదని వెల్లడిస్తూ దాని సీటును గెలుచుకుంది. ఒడిశాలో ధామ్‌నగర్ సీటుపై అధికారిక బీజేడీ కన్నేసినా.. బీజేపీ తన సీటును దక్కించుకోగలిగింది. మహారాష్ట్రలో మాత్రం బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం పోటీలో దిగకపోవడంతో ఉద్ధవ్ ఠాక్రే శివసేన తన స్థానాన్ని పదిలం చేసుకుంది.

click me!