
up assembly elections 2022: వచ్చే ఏడాదిలో (2022) ప్రారంభంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో యూపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాదీ పార్టీ చీఫ్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అన్నారు. కేంద్రం మంత్రి కాన్వాయ్ రైతులపైకి దూసుకెళ్లడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరీ ఘటనను ప్రస్తావిస్తూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. లఖింపూర్ ఖేరీ ఘటనను జలియన్ వాలాబాగ్ ఘటనతో పోలుస్తూ.. నాడు బ్రిటిష్ వారు ముందు నుండి బుల్లెట్ల తో ప్రజలపై విరుచుకుపడి ప్రాణాలు తీశారు. నేడు బీజేపీ వెనుక నుంచి జీపులతో ప్రజల ప్రాణాలు తీస్తన్నదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: బూటకపు ఎన్‌కౌంటర్లకు ఆస్కారం లేదు.. AFSPAపై NHRC ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
2022 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'సమాజ్ వాదీ విజయ్ యాత్ర' ఏడో దశలో భాగంగా రాయ్ బరేలీలో రెండు రోజుల పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాబోయే 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది అని పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో రైతులపై నుంచి కేంద్ర మంత్రి కాన్వాయ్ పోనిచ్చిన ఘటనలో రైతులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర పుటలను వెనక్కి తిప్పితే, బ్రిటిష్ వారు ముందు నుంచి (ప్రజలపై) కాల్పులు జరిపినప్పుడు జలియన్ వాలాబాగ్ ఊచకోత గుర్తుకు వస్తుంది. కానీ, బీజేపీ వెనుక నుండి వారిపై జీపులను పోనిచ్చింది. నిందితులపై ఎలాంటి చర్యలు ప్రారంభించబడలేదు. కేంద్ర హోం శాఖ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని (అజయ్ మిశ్రా)ను ఇప్పటివరకు తొలగించలేదు" అని అన్నారు. ఈ ప్రభుత్వం (బీజేపీ సర్కారు) వివక్ష పూరితంగా పనిచేస్తోంది అని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. అధికార బీజేపీ ప్రజలను అవమానిస్తున్నదని విమర్శించారు.
Also Read: Cold Wave: చలి చంపేస్తోంది బాబోయ్.. మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. అధికారుల హెచ్చరికలు
ఇదిలావుండగా, యూపీలో ప్రతిపక్ష పార్టీకి చెందినవారిపై ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ నేతలతో పాటు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్నిహితుల ఇండ్లల్లో శనివారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుత ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. అఖిలేశ్ యాదవ్ అత్యంత సన్నిహితుడు, పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రాయ్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించుకుని ఇతర పార్టీల నేతలను భయాందోళనకు గురిచేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై రాజీవ్ రాయ్ మాట్లాడుతూ.. తన వద్ద నల్లధనం లేదు, తనకు క్రిమినల్ బ్యాగ్రౌండ్ కూడా లేదు. అయితే, ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వానికి నచ్చకపోవడంతోనే ఈ ఫలితం అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై సెంట్రల్ ఏజెన్సీలను ఉసిగొల్పి బెదరగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు.
Also Read: Omicran: మూడు డోసులు తీసుకున్నా వదలని ఒమిక్రాన్..