
Meghalaya Assembly Election 2023: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మేఘాలయ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీని ఢిల్లీ నుంచి తరిమిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మేఘాలయలో టీఎంసీకి ఓటు వేయండి.. ఢిల్లీ నుంచి బీజేపీని తరిమికొడతామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. సీఏఏ, ఎన్ఆర్సీలను గురించి ఆమె ప్రస్తావించారు.
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మేఘాలయలో టీఎంసీకి ఓటేస్తే బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొడతామన్నారు. బయటి నుంచి వచ్చి సీఏఏ, ఎన్ఆర్సీలను ఇక్కడి ప్రజలపై రుద్దుతున్నారని పేర్కొన్నారు. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఏ పనిచేయలేదని విమర్శించారు. మేఘాలయ అభివృద్ధి, ప్రజల కోసం టీఎంసీ మాత్రమే పనిచేయగలదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. సంగ్మా ప్రభుత్వం ఇక్కడ వైద్య కళాశాలను కూడా నిర్మించలేదని విమర్శించారు. మంచి ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. టీఎంసీకి ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని మమతా బెనర్జీ తెలిపారు.
కాగా, మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా, మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు రోజుకో రకంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా బుధవారం ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ, ఆరెస్సెస్ లను టార్గెట్ చేశారు. ఇదే సమయంలో టీఎంసీ పై కూడా ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. టీఎంసీ రాజకీయంగా బీజేపీకి సహకరిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.