ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం?.. ఒపీనియన్ పోల్స్ వెల్లడించిన విషయాలివే

By telugu teamFirst Published Nov 17, 2021, 1:45 PM IST
Highlights

ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైకి మళ్లుతున్నది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, బీఎస్‌పీలు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలపై మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్‌ను వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని, సమాజ్‌వాదీ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలవనుండగా, కాంగ్రెస్ మాత్రం ఎనిమిది లోపే సీట్లు గెలుచుకుంటుందని వివరించాయి.
 

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న Uttar Pradesh అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రాష్ట్రం నుంచే అత్యధిక ఎంపీ స్థానాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌పై BJPకి ప్రత్యేక దృష్టి ఉన్నది. అదీగాక, ప్రధాని Narendr Modi కూడా ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం కూడా అసెంబ్లీ ఎన్నికలు ఈ పార్టీకి ప్రతిష్టాత్మకం కానున్నాయి. అయితే, కరోనా వైరస్ సెకండ్ వేవ్ నిర్వహణలో ప్రస్తుత యూపీ సీఎం Yogi Adityanath పై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వెల్లడైంది. మరికొన్ని అంశాల్లోనూ యూపీ యూనిట్‌లో అలజడి రేగింది. కానీ, అధిష్టానం దాన్ని చల్లార్చింది. వచ్చే ఎన్నికల్లోనూ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యానాథ్‌నే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టంగా వెల్లడించారు. ఈ తరుణంలోనే వచ్చే Assembly Electionsను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు ఎక్కువగా రాష్ట్రానికి పర్యటనలు చేస్తున్నారు. అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభాలు, హామీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రజల మనసును చూరగొనే పనిలో బీజేపీ పడగా.. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలూ బలంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ హడావిడిలోనే వచ్చే ఎన్నికలపై మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. 

టైమ్స్ నౌ-పోల్‌స్ట్రాట్ ఒపీనియన్ పోల్స్ ఫలితాలు బీజేపీకి పెద్ద ఊరట ఇచ్చాయి. ఎందుకంటే మళ్లీ బీజేపీనే ఉత్తరప్రదేశ్‌ను హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఈ ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. యూపీ అసెంబ్లీలో 403 సీట్లున్నాయి. ఇందులో మెజార్టీ మార్క్‌కు మించి 239 నుంచి 245 సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశముందని తెలిపాయి. అయితే రాష్ట్రంలో రెండో అతిపెద్దగా పార్టీ సమాజ్‌వాదీ పార్టీ నిలిచే అవకాశముందని వివరించాయి. ఇది కూడా బీజేపీకి చాలా దూరంలో నిలవనుంది. బీజేపీ దాదాపు 250 సీట్లను రాబట్టే అవకాశముందని పోల్స్ తెలుపగా సమాజ్‌వాదీ పార్టీ మాత్రం 119 నుంచి 125 స్థానాల దగ్గరే ఆగిపోయే ఛాన్స్ ఉన్నదని వివరించాయి. కాగా, బీఎస్‌పీ మాత్రం అటు బీజేపీకి, ఇటు సమాజ్‌వాదీ పార్టీ పెద్దమొత్తంలో ఓటు షేర్‌ను కోల్పోతుందని అంచనా వేశాయి.

Also Read: పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన ప్రధాని.. యుద్ధ విమానాల విన్యాసాలు

లఖింపూర్ ఖేరి ఘటన తర్వాత రాష్ట్రంలో జోరుగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఒపీనియన్ పోల్స్ రుచించేలా లేదు. గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. 403 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలనే గెలుచుకుంది. ఈ సారి కూడా కాంగ్రెస్ ప్రదర్శన ఇదే స్థాయిలో ఉండవచ్చని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు నుంచి ఎనిమిది స్థానాలను మాత్రమే గెలుచుకునే వీలు ఉన్నదని తెలిపాయి.

ఈ అంచనాలు నిజమైతే యోగి ఆదిత్యానాథ్ రాష్ట్ర చరిత్రను తిరగరాయనున్నారు. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా యోగి ఆదిత్యానాథ్ రికార్డు సృష్టించనున్నారు.

Also Read: UP polls 2022: బీజేపీ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ విమర్శలు..!

బీజేపీకి మేలు చేకూర్చిన యోగి ఆదిత్యానాథ్ విధానాలనూ చూచాయగా ఈ ఒపీనియన్ పోల్స్ తెలిపాయి. లా అండ్ ఆర్డర్‌కు సంబంధించి యోగి ఆదిత్యానాథ్ కటువైన తీరును ప్రజలను మెచ్చుకుంటున్నట్టు వివరించాయి. దీనికి తోడు మత మార్పిడిలను అరికట్టే చట్టబద్ధమైన పరిష్కారాలను కనుగొనడంపై హర్షం వ్యక్తం చేసినట్టు పేర్కొన్నాయి. కాగా, పౌరసత్వ సవరణ చట్టంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు ఒపీనియన్ పోల్స్ తెలిపాయి. ఇవి మతపరమైన ఎజెండాను ముందుకు తీసుకువచ్చే అంశంలో భాగంగానే చేపట్టిన చర్యగా సుమారు సగం మంది అభిప్రాయపడినట్టు వివరించాయి.

ఈ ఒపీనియన్ పోల్స్‌ను నవంబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ మధ్య నిర్వహించారు. సుమారు 9000 మంది అభిప్రాయాలు సేకరించి రూపొందించారు.

click me!