గుజరాత్ ఎన్నికల్లో దిగొద్దని బీజేపీ ఆఫర్ చేసింది: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

By Mahesh KFirst Published Nov 5, 2022, 3:23 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీజేపీ తనను కోరిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగైతే.. తన మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లపై ఉన్న అన్ని అభియోగాలను ఎత్తేస్తామని ఆఫర్ చేశారని వివరించారు.
 

న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుకోవాలని సూచిస్తూ తనకు ఆఫర్ చేశారని కేజ్రీవాల్ ఈ రోజు ఎన్డీటీవీ సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను దర్యాప్తు సంస్థల నుంచి, అన్ని అభియోగాల నుంచి బయటవేస్తామని ఆఫర్ చేశారని అన్నారు.

ఒక వైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. అదే సమయంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, కానీ, ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోతుందని భయపడుతున్నదని కేజ్రీవాల్ అన్నారు.

‘ఆప్‌ను విడిచిపెడితే ఢిల్లీకి సీఎం చేస్తామని వారు మనీష్ సిసోడియాకు ఆఫర్ చేశారు. ఆ ఆఫర్‌ను మనీష్ సిసోడియా తిరస్కరించారు. దీనితో వారు నేరుగా నన్నే అప్రోచ్ అయ్యారు. గుజరాత్‌ను వదిలిపెడితే, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఢిల్లీ మంత్రులు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలపై ఉన్న అభియోగాలు అన్నింటిని ఎత్తేస్తామని ఆఫర్ చేశారు’ అని తెలిపారు. 

Also Read: ఫాంహౌజ్ కుట్ర నిన్న మొన్నటి కాదు.. కేంద్రం హిట్ లిస్ట్‌లో 4 రాష్ట్ర ప్రభుత్వాలు : కేసీఆర్

ఆ ఆఫర్ ఎవరు చేశారని ప్రశ్నించగా.. ఆ పేర్లు బయటపెట్టడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిరాకరించారు. ‘నేను నా మనిషి పేరునే ఎలా బయటపెట్టగలను. ఈ ఆఫర్ నా మనిషి ద్వారానే వచ్చింది. వారు (బీజేపీ) నేరుగా ఎవరినీ అప్రోచ్ కారు. వారు ఒకరి నుంచి మరొకరు.. అక్కడి నుంచి ఇంకొకరు అలా టార్గెట్ చేసిన వ్యక్తి వద్దకు చేరుకుంటారు. ఇదే రీతిలో ఆ సందేశాన్ని వారికి పంపిస్తారు’ అని తెలిపారు.

గుజరాత్‌లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసాన్ని ప్రకటించారు. 182 స్థానాల గుజరాత్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కేవలం ఐదు సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. ఈ రాష్ట్రంలో ఆప్ ఇప్పటికే నెంబర 2 స్థానంలో ఉన్నదని వివరించారు. కాంగ్రెస్ కంటే కూడా ముందంజలో ఉన్నదని తెలిపారు. మరో నెలలో తాము బీజేపీని మించి ముందుకు దూసుకెళ్లుతామని చెప్పారు.

click me!