
Modi in Hyderabad: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మెగా షోకు ముందు హైదరాబాద్ నగరం మొత్తం బీజేపీ జెండాలు, బ్యానర్లతో కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతల భారీ కటౌట్లు వెలిశాయి. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్ లో శనివారం నాడు ప్రారంభం కానుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 350 మంది ప్రతినిధులు జాతీయ కార్యవర్గానికి హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు హైదరాబాద్‌కు చేరుకుని బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించనున్నారు.
18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. 2004లో కాషాయ పార్టీ ఇక్కడ చివరిసారిగా సమావేశాన్ని నిర్వహించింది. దీనికి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, అప్పటి పార్టీ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత జరగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం. వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, దక్షిణాలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే దక్షిణాది రాష్ట్రాలు కీలకంగా ఉంటాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. ఇక మరింత దూకుడుగా ముందుకు సాగుతున్న తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి సీఎం పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. వరుస పెట్టి అగ్రనాయకులు తెలంగాణ పర్యటనకు రావడంతో పాటు సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పై విమర్శలుగుప్పిస్తున్నారు.
ఇక నేడు ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా ఎన్నికల ఎత్తుగడను ముందుకు తీసుకురానుందని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంతో పాటు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే విజయ్ సంకల్ప్ బహిరంగ సభను కాషాయ దళం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అనేకమంది అగ్రనేతల రానున్న నేపథ్యంలో HICC చుట్టూ విస్తృతమైన భద్రతా ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. హెచ్‌ఐసిసి చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్‌ల ఎగురవేయడాన్ని నిషేధించారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ పోలీసులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. టీఎస్‌ఎస్‌పీ (తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసులు)తో పాటు హైదరాబాద్ నగరం, ఇతర జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసు సిబ్బందిని కూడా మోహరిస్తామని చెప్పారు. జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత జరిగే పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం పాలుపంచుకోనుంది.