PM Modi Hyderabad Visit: బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం.. కాషాయ‌మ‌య‌మైన హైద‌రాబాద్

By Mahesh RajamoniFirst Published Jul 2, 2022, 10:06 AM IST
Highlights

BJP national executive meet: బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 350 మంది ప్రతినిధులు జాతీయ కార్యవర్గానికి హాజరుకానున్నారు.
 

Modi in Hyderabad: ద‌క్షిణాది రాష్ట్రమైన తెలంగాణ‌కు ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఎలాగైన తెలంగాణ‌తో పాటు ద‌క్షిణాద రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని చూస్తున్న బీజేపీ హైదరాబాద్ లో జ‌రిగే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంతో కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నుంది. ఆ త‌ర్వాత రోజు జ‌రిగే ప‌రేడ్ గ్రౌండ్స్ బ‌హిరంగ స‌భ‌ను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంది. వ‌చ్చే ఏడాది తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి కూడా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం. శనివారం నుంచి ప్రారంభం కానున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి భాగ్య‌నగరం ముస్తాబవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ కాషాయ రంగులోకి మారింది. బీజేపీ పార్టీ జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, భారీ కటౌట్‌లను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. రెండు రోజుల సమావేశం సందర్భంగా ప్రధాన ట్రాఫిక్ కూడళ్లను పార్టీ మద్దతుదారులు జెండాలు, కాషాయ వ‌స్త్రాల‌తో అలంకరించారు.

హైద‌రాబాద్ నగరంలోని పలు చోట్ల ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర‌ హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలు స‌హా మ‌రికొంత మంది బీజేపీ నేత‌ల భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ స‌మావేశ‌ వేదిక హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసిసి)కి వెళ్లే రహదారులపై పార్టీ జాతీయ నాయకులు, ఇతర ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే, పార్టీ జెండాలతో కూడిన‌ తోర‌ణాలు క‌ట్టారు. రెండు రోజుల జాతీయ కార్యవర్గం స‌మావేశ‌ ముగింపు సందర్భంగా ఆదివారం జరిగే బహిరంగ సభలో ప్రధాని మోడీ, ఇతర బీజేపీ జాతీయ నేతలు ప్రసంగించనున్న పరేడ్ గ్రౌండ్ చుట్టూ పలు కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 350 మంది ప్రతినిధులు జాతీయ కార్యవర్గానికి హాజరుకానున్నారు. వీరిలో ప‌లువురు బ‌హిరంగ స‌భ‌కు సైతం హాజ‌రుకానున్నారు. జాతీయ కార్యవర్గం గత కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించి, పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. 

ఈ ఏడాది చివర్లో మరియు వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంద‌ని స‌మాచారం. ద‌క్షిణాదిలో విస్త‌రించాల‌ని చూస్తున్న బీజేపీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టేలా ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌, ఇత‌ర విష‌యాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. గత ఎనిమిదేళ్లలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలపై రాజకీయ తీర్మానం సహా పలు అంశాలపై జాతీయ కార్యవర్గం తీర్మానాలు చేసే అవకాశం ఉంది. జాతీయ కార్యవర్గంలో జరిగే అన్ని చర్చలకు 340 మంది ప్రతినిధులతో పాటు ప్రధాని మోదీ హాజరవుతారని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విలేకరులకు తెలిపారు. ఆదివారం 'విజయ్ సంకల్పం' పేరుతో జరిగే బహిరంగ సభకు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని 35 వేల పోలింగ్ బూత్‌ల నుంచి పార్టీ ఇంచార్జిలు ప్రమాణం చేయనున్నారు.

click me!