హెచ్‌ఐసీసీలో బీజేపీ పదాధికారులు సమావేశం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో భేటీ..

By Sumanth KanukulaFirst Published Jul 2, 2022, 10:55 AM IST
Highlights

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్దం అయింది. నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ పదాధికారులు సమావేశం నిర్వహించారు. 

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్దం అయింది. నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ పదాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 148 మంది ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం కొనసాగనుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాలు- అజెండా ఖరారు చేయనున్నారు. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ ముఖ్య నేతలు హైదరాబాద్‌కు క్యూ కట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీ చేరుకుంటారు. అక్కడ నోవాటెల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం బీజీపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు.

Also Read: PM Modi Hyderabad Visit: బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం.. కాషాయ‌మ‌య‌మైన హైద‌రాబాద్

ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించారు. నడ్డా రోడ్‌షో కొనసాగుతుండగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, కళలు ఉట్టిపడేలా ఈ స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హెచ్‌ఐసీసీ సమావేశ ప్రాంగణానికి చేరుకున్న జేపీ నడ్డా అధ్యక్షతన జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్వహించాల్సిన చర్చలు, చేయాల్సిన తీర్మానాల ఎజెండాపై చర్చించారు.  

ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో.. హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC), నోవాటెల్ హోటల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పార్టీ అగ్ర నాయకుల భారీ కటౌట్‌లు, బ్యానర్లు, జెండాలతో  కాషాయమయంగా మార్చారు. 

మరోవైపు హెచ్‌ఐసీసీ, బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాట్లను చేపట్టారు. హెచ్‌ఐసీసీ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని పోలీసులు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీ 5 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీసీటీవీ ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి పరిశీలిస్తున్నారు. 

click me!