
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ లండన్ పర్యటనలో మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును అణిచివేస్తోందని, మైనారిటీలు, పత్రికలపై దాడులు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ నేపధ్యంలో తాజాగా రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. రాహుల్ వ్యాఖ్యలపై భోపాల్ లోక్ సభ సభ్యురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
'విదేశీ తల్లి కొడుకు దేశభక్తుడు కాలేడు'
భోపాల్ ఎంపీ ప్రగ్యా ప్రజ్ఞా సింగ్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ స్త్రీకి పుట్టిన కొడుకు ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారని, మీ తల్లి ఇటలీ దేశీయురాలు కావున మీరు భారతదేశానికి చెందినవారు కాదని తాము భావించామని అన్నారు. పరాయి దేశ స్త్రీకి పుట్టిన కొడుకు ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని చాణక్యుడు చెప్పాడని అన్నారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో దేశాన్ని, దేశ ప్రజలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన పార్టీ సహచరులను పార్లమెంటులో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.
'కాంగ్రెస్ దేశాన్ని ఖాళీ చేసింది'
ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని దోపిడి చేసిందని ప్రజ్ఞా అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి పార్లమెంట్ లో మాట్లాడనివ్వడం లేదని అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంతకంటే అవమానకరం మరొకటి ఉండదనీ, అలాంటి రాహుల్ గాంధీని తాను శపిస్తానని అన్నారు. ఇంకా ప్రగ్యా మాట్లాడుతూ.. ఇప్పుడు మన దేశంలో ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తాలనీ, దేశంపై అసత్య ప్రచారాలు చేసేవారిని రాజకీయాలలో అవకాశం ఇవ్వకూడదనీ, వారిని రాజకీయాల నుండి, దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ప్రగ్యా.. పార్లమెంట్‌లో పనులు బాగా జరుగుతున్నాయని అన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. కాంగ్రెస్ వాళ్లు సభను నడపనివ్వడం లేదు. పార్లమెంటు సాజావుగా కొనసాగితే మరిన్ని పనులు జరుగుతాయని, పనులు ఎక్కువైతే .. కాంగ్రెస్ ఉనికి ఉండదు. ఏది ఏమైనా కాంగ్రెస్ ఉనికి అంతంత మాత్రంగానే ఉందనీ, కానీ ఇప్పుడు కాంగ్రెస్ తెలివితేటలు కూడా భ్రష్టుపట్టిపోతున్నాయని ఎద్దేవా చేశారు. శనివారం సంత్ హిర్దారామ్ నగర్ స్టేషన్‌లో ఐదు రైళ్ల ఆగమనం సందర్భంగా భోపాల్-దాహోద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి సాధ్వి ప్రజ్ఞ చేరుకున్నారు.
రాహుల్ గాంధీ ఏం అన్నారు?
ఇటీవల బ్రిటన్ పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపైనా, బీజేపీపైనా పలు ఆరోపణలు చేశారు. విపక్షాలు మాట్లాడుతున్నప్పుడు లోక్‌సభలో పనిచేసే మైకులు తరచూ స్విచ్ ఆఫ్ అవుతుంటాయి. దీనితో పాటు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఉపన్యాస సమయంలో అనేక వాదనలు కూడా చేయబడ్డాయి. దీనికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ కూడా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన పార్లమెంటులో మైక్ స్విచ్ ఆఫ్ అయిందని కొందరు ఆరోపిస్తున్నారని, ఇంతకంటే అవాస్తవం మరొకటి ఉండదని అన్నారు.