
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేజీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 6-7 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమైంది. అంతర్గత పోరు వల్లే కాంగ్రెస్ పతనం అవుతుందని, రాష్ట్రంలో అవినీతిని బీజేపీ లేవనెత్తుతుందని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను సమర్పించేందుకు కర్ణాటకలోని బీజేపీ యూనిట్ ఆగస్టు 17న గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కలవాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.
గతంలో కర్నాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, కాంట్రాక్టర్ల నుంచి 55 శాతం వరకు కమీషన్లు అడుగుతున్నారని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రమైందనీ, ఫలితంగా నియోజకవర్గాలకు నిధుల కొరత ఏర్పడిందని ఆరోపించారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోందనీ, అయితే.. ప్రభుత్వం నిజంగా కూలిపోతుందా? లేదా? అనేది అనిశ్చితంగా ఉందనీ, ఈ పరిణామాన్ని అందరూ వేచి చూడాలని అన్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్ కూడా ఈ ఏడాది చివరి నాటికి కర్ణాటకలో అధికార కాంగ్రెస్ కూలిపోతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖలో ముఖ్యమంత్రి పదవిపై ఆధిపత్య పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.