స్కూల్ సిలబస్‌లో మార్పులు.. సిద్ధరామయ్య సర్కార్ యోచన : వాళ్లకు మెకాలే విద్య కావాలేమోనంటూ బీజేపీ చురకలు

By Siva KodatiFirst Published Jun 7, 2023, 2:39 PM IST
Highlights

కర్ణాటకలో స్కూల్ సిలబస్‌లో మార్పులు చేయాలని సిద్ధరామయ్య సర్కార్ యోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లకు మెకాలే విద్యా కావాలేమోనంటూ వారు చురకలంటిస్తున్నారు. 

నూతనంగా ఏర్పాటైన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ హయాంలో చేసిన పాఠశాల పాఠ్య పుస్తకాల సవరణలను ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సిద్ధూ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనందున మార్పులు , చేర్పులు చేయడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భగా కర్ణాటక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) మంత్రి సతీష్ జార్జిహోళీ మాట్లాడుతూ.. గతంలో అసలు వాస్తవాలను వక్రీకరించారని మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బసవన్నకు సంబందించిన సంఘటనలతో సహా చారిత్రక వాస్తవాలను బీజేపీ వక్రీకరించిందని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంలో తాము మార్పు తీసుకొస్తామని ముందే చెప్పామని.. అయితే నిపుణుల కమిటీ సూచనల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని సతీశ్ వెల్లడించారు. 

మరోవైపు అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పాఠ్య పుస్తకాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూ వుండటంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. పాఠ్య పుస్తకాలను సవరిస్తామని ప్రభుత్వం చెప్పడం ఆశ్చర్యకరంగా వుందన్నారు. అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు.. శాఖలపై పట్టు కూడా రాలేదు, అప్పుడే ఈ స్థాయిలో నిర్ణయాలేంటీ అంటూ సునీల్ చురకలంటించారు. దేశభక్తి, సంస్కృతి, జాతీయవాదం, విద్య అనేవి పాఠ్య పుస్తకాల్లో భాగం కావాలన్నారు. మరి కాంగ్రెస్‌కు ఎలాంటి విద్య కావాలని సునీల్ కుమార్ ప్రశ్నించారు. మెకాలే విద్యను తీసుకొచ్చి గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అని ఆయన దుయ్యబట్టారు. 

కాగా.. కర్ణాటక ప్రతిష్టకు భంగం కలిగించే అన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు, బిల్లులను తాము సమీక్షిస్తామని కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలు చేసిన అనంతరం పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలని సిద్ధూ ప్రభుత్వం భావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.     
 

click me!