
త్రిపుర కొత్త సీఎం పేరు ప్రకటన సమయంలో గందరగోళం నెలకొంది. సీఎంగా మాణిక్ సాహాను నియమించడం పట్ల ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు చెప్పకుండానే సీఎంగా ఆయననెలా ఎంపిక చేస్తారంటూ పలువురు నాయకులు ఆందోళన చేశారు. కుర్చీలను నేలకు కొట్టారు. గట్టిగా అరిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క సారిగా వాతావరణం వేడెక్కింది.
త్రిపుర సీఎంగా బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌ను అందించారు. దీంతో కొత్త సీఎంని నియమించడం అనివార్యం అయ్యింది. బీజేపీ త్రిపుర అధ్యక్షుడిగా ఉన్న మాణిక్ సాహాను సీఎంగా అధిష్టానం ప్రకటించింది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా త్రిపురలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
త్రిపుర కొత్త సీఎంగా మాణిక్ సాహా
మాణిక్ సాహా వృత్తి రీత్యా దంతవైద్యుడు. 69 ఏళ్ల సాహా గత నెలలో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఆయన 2016లో బీజేపీలో చేరారు. అయితే బీజేపీ కొత్త సీఎం పేరును ప్రకటించిన పార్టీ కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, మంత్రి రామ్ ప్రసాద్ పాల్ తన సహచరులతో వాగ్వాదానికి దిగారు. గట్టిగా అరిస్తూ ప్లాస్టిక్ కుర్చీని నేలకేసి కొట్టారు.
త్రిపుర రాజకుటుంబానికి చెందిన ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ ను తదుపరి సీఎంగా ప్రకటించాలని రామ్ ప్రసాద్ పాల్ కోరినట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాణిక్ సాహా పేరును ఖరారు చేయడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒక్క సారిగా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ సమయంలో పలువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు నెట్టుకున్నారు. సాహాను ముఖ్యమంత్రిగా నియమించే ముందు పార్టీలో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని మరో బీజేపీ ఎమ్మెల్యే పరిమళ్ దెబ్బర్మ అన్నారు.
త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
బీజేపీ సమావేశంలో చోటు చేసుకున్న ఈ పరిణామం అంతా అక్కడ ఉన్న పలువురు వీడియో తీశారు. బీజేపీ పాలిత త్రిపురలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ఈ విజువల్స్ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసింది. "గూండాయిజం ఉత్తమంగా ఉంది. రామ్ ప్రసాద్ పాల్ తో పాటు అనేక మంది ఇతర బీజేపీ త్రిపుర ఎమ్మెల్యేలు, మంత్రులు నాయకులు బిప్లబ్ దేబ్ రాజీనామా తరువాత గందరగోళంలో పడ్డారు, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రం చీకటి కాలానికి వెళ్తోందని మరోసారి రుజువు అవుతోంది ’’ అని తృణమూల్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.