
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లను బీజేపీ గెలుచుకుంది. తద్వార ఈ పర్యాటక రాష్ట్రంలో వరుసగా మూడో సారి అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయింది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్‌కు అందించారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై బీజేపీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. తదుపరి సీఎంపై ఆ పార్టీ సస్పెన్స్ పెట్టింది.
సీఎం ప్రమోద్ సావంత్ ఎప్పుడూ తాను పోటీ చేసే సాంక్వెలిమ్ నుంచే పోటీ చేశారు. అయినా కూడా చాలా తక్కువ మెజార్టీతో గెలుపొందారు. ఆయన కేవలం 666 ఓట్లతో గెలుపు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను రీప్లేస్ చేయాలనే ఆలోచనలు బీజేపీ చేస్తున్నట్టు కొన్ని వాదనలు జరుగుతున్నాయి.
‘ఔను నేను చాలా స్వల్ప మార్జిన్‌తో గెలిచాను. కానీ, బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. ఇది నిజంగా నాకు సవాల్ వంటిది. నేను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం క్యాంపెయిన్ చేశాను. కానీ, సొంత నియోజకవర్గానికి రావడానికి ఎక్కువగా వీలు పడలేదు. నా కోసం నా కార్యకర్తలు ప్రచారం చేశారు’ అంటూ ప్రమోద్ సావంత్ వివరించారు.
కాగా, సీఎం మార్పుపై మంత్రి ఆరోగ్య శాఖ విశ్వజిత్ రాణె స్పందించారు. ఇది నింజగా సున్నితమైన ప్రశ్నగా భావించడం లేదని పేర్కొన్నారు. సీఎంగా సావంత్ ప్లేస్‌లో మరొకరిని నియమిస్తారా? అనే విషయంపై ఇప్పుడు స్పందించలేమని చెప్పారు.
ఇది మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ వల్ల బీజేపీకి వచ్చిన విజయమేనని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే అన్నారు. ఆయన గోవాకు ఎంతో ప్రయోజనం ఒనగూర్చారని తెలిపారు. ఇది ప్రజల విజయం అని, ఇది బీజేపీ నాయకత్వ విజయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కేవలం ప్రజలను పిచ్చివాళ్లను చేశాయని అన్నారు. కారులో కూర్చుని ఈ సమాధానలు ఇస్తుండగా విశ్వజిత్ రాణె వెనుక ఉన్నవారు ముఖ్యమంత్రిగా రాణెను ఎంచుకోవాలని డిమాండ్ చేయడం గమనార్హం.
యూపీ ఫలితాలు (up election results) 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఫిక్స్ చేశాయని ప్రధాని మోడీ (narendra modi) అన్నారు. ఇవే ఫలితాలు 2024లోనూ రిపీట్ అవుతాయని ప్రధాని జోస్యం చెప్పారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని మోడీ కొనియాడారు. తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని.. గోవాలో అందరి అంచనాలు తలకిందులయ్యాయని మోడీ పేర్కొన్నారు. గోవా ప్రజలు బీజేపీకి (bjp) మూడోసారి అధికారాన్ని కట్టబెట్టారని.. ఉత్తరాఖండ్‌లో ఫస్ట్ టైమ్ వరుసగా రెండోసారి పవర్‌లోకి వచ్చిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలనతీరును మెచ్చి ప్రజలిచ్చిన తీర్పు అని మోడీ వ్యాఖ్యానించారు. పేదరికం నిర్మూలన అంటూ చాలా నినాదాలు, స్కీమ్‌లు వచ్చాయన్నారు. పేదరికం తొలగించేందుకు బీజేపీ చిత్తశుద్ధితో పనిచేసిందని నరేంద్రమోడీ గుర్తుచేశారు.