
Congress leader Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మేఘాలయలో తన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, ఆరెస్సెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అలాగే, మీడియాను సైతం టార్గెట్ చేస్తూ పలు రోపణలు చేశారు. షిల్లాంగ్‌లోని మల్కీ గ్రౌండ్ ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ లాగా తన ప్రసంగం మీడియాలో కనిపించదని అన్నారు. "ప్రధాని నరేంద్ర మోడీతో సంబంధాలున్న ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలు మీడియాను నియంత్రిస్తున్నందున నా ప్రసంగం మీడియాలో కనిపించడం లేదు. ఇకపై మీడియాలో తమ భావాలను వ్యక్తపరచలేము" అంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షిల్లాంగ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ-ఆరెస్సెస్ లపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లు పాఠశాల తరగతి గదుల్లోని రౌడీల లాంటివారని ఆరోపిస్తూ.. తమకు అన్నీ తెలుసని, ఎవరికీ గౌరవం ఇవ్వరంటూ విమర్శించారు. తమకు అన్నీ తెలుసునని భావించే బీజేపీ ఎవరినీ గౌరవించని ‘క్లాస్ రౌడీ’ లాంటిదని ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి మేఘాలయ ఎన్నికల్లో పోరాడుతోందని ఆరోపిస్తూ, టీఎంసీపై కూడా ఆయన విమర్శలు చేశారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మేఘాలయ భాష, సంస్కృతి, చరిత్రకు హాని కలిగించే బీజేపీని కాంగ్రెస్ అనుమతించబోదని అన్నారు.
రాహుల్ గాంధీ తాను ధరించిన సాంప్రదాయ జాకెట్‌ను చూపిస్తూ, "మీ సంస్కృతి, సంప్రదాయానికి గౌరవ సూచకంగా నేను దానిని ధరించాను. నేను చేసే పనులు, ఇక్కడి వారిని, వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయని" అన్నారు. ఈ ప్రాంత పురుషులు ముఖ్యంగా వేడుకలు, ముఖ్యమైన పండుగల సమయంలో సాంప్రదాయకంగా ధరించే నడుము కోటును ధరించడం మేఘాలయ ప్రజల సంస్కృతి-సంప్రదాయానికి గౌరవసూచకంగా దానిని భావిస్తున్నట్టు చెప్పారు. అందుకే తాను కూడా ఈ కోటును ధరించినట్లు చెప్పారు. అయితే, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ జాకెట్ వేసుకుని మీ మతం, సంస్కృతి, చరిత్ర, భాషపై దాడికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు.
టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "టీఎంసీ చరిత్ర మీకు తెలుసు.. పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న హింస, కుంభకోణాల వారి సంప్రదాయం మీకు తెలుసు. వారు గోవాలో (ఎన్నికలు) భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు.. బీజేపీకి సహాయం చేయాలనే ఆలోచనలో అలా చేశారు. సరిగ్గా ఇప్పుడు మేఘాలయలో ఇదే ఆలోచనలో ఉన్నారు. మేఘాలయలో బీజేపీని బలోపేతం చేసి అధికారంలోకి రావాలన్నదే టీఎంసీ ఆలోచన" అంటూ ఆరోపించారు. రాష్ట్రంలోని కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని ఎండీఏ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కూడా గాంధీ ఆరోపించారు.