
Rajya Sabha MP Kapil Sibal: గత కొన్నేళ్లుగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను బీజేపీ కూలదోసిందనీ, ఈ ధోరణిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తో పాటు మరో ఎనిమిది మందిని చేర్చుకున్న తర్వాత ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో ఆదివారం జరిగిన తిరుగుబాటుతో అజిత్ పవార్ మహారాష్ట్రలో అధికార ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన-బీజేపీ కూటమితో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
''బీజేపీ అధికార ప్రలోభాల కారణంగా ప్రజలచేత ఎన్నికైన ప్రతిపక్ష ప్రభుత్వాలైన ఉత్తరాఖండ్ (2016), అరుణాచల్ ప్రదేశ్ (2016), కర్నాటక (2019), మధ్యప్రదేశ్ (2020), మహారాష్ట్ర (2022) కూలిపోయాయి. ఇప్పుడు చట్టం అనుమతిస్తుందా? అంటూ సుప్రీం కోర్టు జోక్యం కోరుతూ'' ట్వీట్ చేశారు.
అజిత్ పవార్ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడంపై సిబల్ సోమవారం బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. మొదట అవినీతిపరులపై దాడి చేయడం, ఆ తరువాత వారిని కౌగిలించుకోవడం బీజేపీకే చెల్లిందంటూ మండిపడ్డారు. తన తదుపరి రాజకీయ ఎత్తుగడపై వారాల తరబడి సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆదివారం ముంబైలోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా గవర్నర్ రమేశ్ బైస్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక రెబల్ నాయకులపై ఎన్సీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తిరిగి వెళ్లిన వారు మళ్లీ రావచ్చు కానీ దానికంటూ ఒక టైం ఉంటుందని పేర్కొంది. తిరుగుబాటు నాయకులపై తగిన చర్యలు ఉంటాయని పేర్కొంది.