బీజేపీ చీఫ్‌ మార్పంటూ ఊహాగానాలు.. సీటీ రవికి ఛాన్స్, మళ్లీ వేడెక్కుతోన్న కన్నడ రాజకీయం

By Siva KodatiFirst Published Dec 9, 2021, 3:56 PM IST
Highlights

త్వరలో ఎన్నికలు జరగున్న కర్ణాటకలో (karnataka) బీజేపీని (bjp) మరింత బలోపేతం చేసే దిశగా కమలనాథులు వ్యూహా రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీటీ రవికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లుగా కర్ణాటకలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

త్వరలో ఎన్నికలు జరగున్న కర్ణాటకలో (karnataka) బీజేపీని (bjp) మరింత బలోపేతం చేసే దిశగా కమలనాథులు వ్యూహా రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సీటీ రవికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లుగా కర్ణాటకలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధిష్ఠానం పావులు కదుపుతోంది. ప్రస్తుతం దక్షిణాదిన పార్టీకి అధికారంతో పాటు అనుకూలంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక మాత్రమే. కాంగ్రెస్‌ కూడా ఇదే పరిస్ధితిని ఎదుర్కొంటోంది. 

దక్షిణాదిన ప్రధానమైన మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. మరోసారి ఎన్నికలు జరిగినా జాతీయ పార్టీలకు అవకాశం దక్కుతుందన్న నమ్మకం లేదు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ అధ్యక్షుడిగా బలమైన నేత డీకే శివకుమార్‌ (dk shivakumar) సారథ్యాన్ని కొనసాగిస్తోంది. మాస్‌నేతగా, ట్రబుల్ షూటర్‌గా పేరుండటంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ శివకుమార్‌ అనతికాలంలోనే పట్టు సాధించారు. అంతటి స్థాయిలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ ధీటుగా దూసుకుపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు మంగళూరులోనే ఎక్కువగా వుంటారన్న విమర్శలు సైతం సొంతపార్టీ నుంచే వస్తున్నాయి. 

Also Read:నా బలాన్ని చూపిస్తా.. యడియూరప్ప రాష్ట్రవ్యాప్త యాత్రకు ప్లాన్.. బీజేపీ నాయకత్వంలో కంగారు?

మాజీ సీఎం యడియూరప్ప సామాజిక వర్గానికి చెందినవారే ముఖ్యమంత్రి బొమ్మై (basavaraj bommai) అయినా లింగాయతులలో యడియూరప్పకు (yediyurappa) ఉన్న పట్టును అంత తేలికగా అందుకోవడం అసాధ్యం. మరోవైపు ఒక్కలిగలు, బీసీలు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారిని అక్కున చేర్చుకోవాలంటే ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించడం అంత మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీటీ రవికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి అప్పగించడం ద్వారా ఒక్కలిగ సామాజిక వర్గీయులకు దగ్గరవ్వడంతో పాటు లింగాయతులలో పట్టుకొనసాగాలంటే యడియూరప్ప కుమారుడికి మంత్రి పదవి కట్టబెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నట్టు తెలుస్తోంది. 

దత్తపీఠ వివాదాన్ని పరిష్కరించిన సీటీ రవికి రాష్ట్రమంతటా పరిచయాలున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతూనే జాతీయస్థాయిలో ప్రధాన కార్యదర్శిగాను, పొరుగున ఉండే తమిళనాడుకు ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం త్వరలోనే సీటీ రవికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాల్ని పరిశీలిస్తోంది. యడియూరప్ప, బొమ్మైల ద్వారా వీరశైవ లింగాయతులను, నారాయణస్వామి, గోవింద కారజోళ ద్వారా దళిత సామాజికవర్గాన్ని, శ్రీరాములు, రమేశ్‌ జార్కిహొళి ద్వారా వాల్మీకి సామాజికవర్గీయులను, ఈశ్వరప్ప ద్వారా కురుబ సామాజిక వర్గీయులను అక్కున చేర్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటీ రవి పదవికి సంబంధించి ఎప్పుడైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

click me!