
BJP expels Uttarakhand ex MLA Suresh Rathore: ఉత్తరాఖండ్‌లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన సీనియర్ నేత సురేశ్ రాథోర్‌ను పార్టీ నుంచి 6 ఏళ్లపాటు బహిష్కరించినట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇటీవల రాష్ట్రంలో అమలులోకి వచ్చిన యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) ప్రకారం.. మొదటి భార్యను విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేయడం నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో, రాథోర్ తన రెండో వివాహాన్ని బహిరంగంగా ప్రకటించడం రాజకీయంగా తీవ్రమైన దుమారాన్ని రేపింది.
జ్వాలాపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా పని చేసిన సురేశ్ రాథోర్, మాజీ బీజేపీ ఎస్సీ విభాగం రాష్ట్రాధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. ఇటీవల బాలీవుడ్ నటి ఉర్మిళా సనావార్‌తో సహరన్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే రాథోర్ ఇప్పటికే మొదటి భార్యతో వివాహ బంధంలో ఉన్నాడనీ, ఇది యూసీసీ (UCC) చట్టాన్ని ఉల్లంఘించడం అని ఆరోపణలు వచ్చాయి.
జూన్ 15న సహరన్‌పూర్‌లో ఒక హోటల్‌లో రాథోర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, నటి ఉర్మిళా తనను "ఉర్మిళా సురేశ్ రాథోర్"గా ప్రకటిస్తూ, మాజీ ఎమ్మెల్యేను తన భర్తగా ప్రకటించింది. వారి ప్రేమ విజయాన్ని ఉల్లాసంగా ప్రకటించినా, ఇది పార్టీకి ప్రతికూలంగా మారింది. ఈ వీడియో రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక వేదికలపై తీవ్ర విమర్శలకు దారితీసింది. మొత్తంగా బీజేపీ టార్గెట్ గా మారింది. దీంతో చర్యలు తీసుకుంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ ఆదేశాల మేరకు, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర బిష్ట్ జూన్ 23న రాథోర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో, రాథోర్ ప్రవర్తన పార్టీకి నష్టాన్ని కలిగించిందనీ, ఇది తీవ్రమైన అనుశాసన లోపంగా పేర్కొన్నారు. ఏడు రోజుల గడువులో తృప్తికర సమాధానం రానందున, పార్టీ అతనిని 6 సంవత్సరాల పాటు బహిష్కరించిందని పేర్కొన్నారు.
సురేశ్ రాథోర్ బహిష్కరణపై మాట్లాడుతూ.. తాను 45 సంవత్సరాలుగా బీజేపీకి నిబద్ధతతో పనిచేస్తున్నానని, ఈ వివాదం తనపై రాజకీయ కుట్రగా ఆరోపించారు. “సోషల్ మీడియా ద్వారా నా పరువు తీసే ప్రయత్నం జరుగుతోంది. నేను ఎప్పుడూ పార్టీ పరువు తీసేలా ప్రవర్తించలేదు” అని రాథోర్ పేర్కొన్నారు.
బీజేపీ నాయకుడి రెండో పెళ్లిపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. “UCC చట్టాన్ని ప్రతిపక్షాలపై ఆయుధంగా వాడుతూ, తమ నాయకులపై మాత్రం అన్వయించుకోవడం లేదు” అని బీజేపీని విమర్శించింది. “ఒకటే చట్టం అందరికి అయితే, రాథోర్‌పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించింది.
యూనిఫార్మ్ సివిల్ కోడ్‌ను దేశంలో మొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్. ఈ చట్టాన్ని బీజేపీ నైతికతకు సూచికగా ప్రచారం చేస్తోంది. అలాంటి పరిస్థితిలో, అదే పార్టీకి చెందిన ప్రముఖ నేత ఈ చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించడం పార్టీకి ప్రతిష్టను కోల్పోయేలా చేసింది. దీంతో రాష్ట్ర నాయకత్వం కఠినంగా వ్యవహరించి రాథోర్‌ను బహిష్కరించాల్సి వచ్చింది.