Karnataka: కర్ణాటక మాజీ సీఎంకు బీజేపీ షాక్.. ! కుమారుడికి టిక్కెట్ నిరాకరించిన అధిష్ఠానం..

By Rajesh KFirst Published May 24, 2022, 11:52 PM IST
Highlights

Karnataka: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర (BY Vijayandra)కు నిరాశ ఎదురైంది. బీజేపీ కోర్ కమిటీ సిఫారుసు చేసిన పేర్లలో విజయేంద్ర పేరు ఉన్నప్పటికీ పార్టీ కేంద్ర అధిష్ఠానం ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు నిరారించింది.  
 

Karnataka: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో  మాజీ సీఎం యడ్యూరప్పకు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు టిక్కెట్ ఇవ్వ‌డానికి బీజేపీ అధిష్టానం నిరాక‌రించింది.  కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని 7 స్థానాల‌కు జూన్ 3న ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. నలుగురు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం ప్రకటించింది. 

ఇందులో.. మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ సవడి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు హేమలత నాయక్, ఎస్.కేశవప్రసాద్, ఎస్‌ మోర్చా అధ్యక్షుడు చలవడి నారాయణస్వామి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే.. ఆ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు బిఎస్ యడియూరప్ప  కుమారుడి పేరు. తెలియదు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న బీఎస్‌ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ నిరాకరించింది.

విజయేంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్‌ నిరాకరించడంపై  అత‌ని మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ(BJP) హైకమాండ్ మరియు యడియూరప్పకు బద్ధ శత్రువుగా పేరున్న జాతీయ సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

దీంతో .. బీజేపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులను శాంతంగా.. సంయమనం పాటించాలని విజయేంద్ర కోరారు. అందరూ సాధారణ పార్టీ కార్యకర్తలేననీ, పార్టీ ఎప్పుడూ  ఎవ‌రిని నిరాశపరచద‌ని, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, మర్యాద పూర్వకంగా న‌డుచుకోవాల‌ని విజయేంద్ర అన్నారు.

కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా విజయేంద్రను నిలబెట్టేందుకు పార్టీ ఆసక్తితో ఉందని, ఎన్నికల ముందు ఆయనకు పార్టీలో మరింత పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 
దీనికి ఒక రోజు ముందు.. సోమవారం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా.. నాగరాజు యాదవ్‌, జబ్బార్‌ల అభ్యర్థిత్వ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపినట్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) తన ప్రకటనలో తెలిపింది. యాదవ్ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) అధ్యక్షుడిగా ఉన్నారు. జబ్బార్ ప్రస్తుతం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) మైనారిటీ సెల్ చైర్మన్ మరియు మాజీ MLC.

7 మంది సభ్యుల పదవీకాలం వచ్చే నెల జూన్ 14తో ముగియనున్నందున ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శాసన మండలిలోని ఈ 7 స్థానాలు బీజేపీకి చెందిన లక్ష్మణ్ సంగప్ప సవాడి, లహర్ సింగ్ సిరోయా, కాంగ్రెస్‌కు చెందిన రామప్ప తిమ్మాపూర్, అల్లుం వీరభద్రప్ప, వీణా అచ్చయ్య ఎస్. మరియు జెడి (సెక్యులర్) హెచ్‌ఎం రమేష్ గౌడ, నారాయణ స్వామి కెవి పదవీకాలం ముగిసిపోతుంది.  శాసన మండలిలోని ఈ ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో, ఎన్నికైన శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) జూన్ 3న పోలింగ్ జ‌రుగ‌నున్న‌ది. ఎన్నికల నామినేషన్ల దాఖలుకు  మంగళవారం చివరి రోజు.

ఎన్నికల్లో గెలవడానికి 29 ఓట్లు కావాలి

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రతి శాసనమండలిలో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలంటే కనీసం 29 ఓట్లు అవసరం. అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా బిజెపి నాలుగు, కాంగ్రెస్ రెండు, జెడి(ఎస్) ఒక సీటు గెలుచుకోవచ్చని అంచనా.

click me!