బీజేపీని ఓడించడం సాధ్యం కాదు.. అప్పటి వరకు ఇదే స్థితి: ప్రతిపక్షాలపై ప్రశాంత్ కిశోర్ ఘాటు వ్యాఖ్యలు

By Mahesh KFirst Published Mar 20, 2023, 8:18 PM IST
Highlights

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విపక్షాల ఐక్యతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్థిరత, భావజాల విభేదాలతో విపక్షాల ఐక్యత సాధ్యం కాదని, విపక్షాల భావజాలల్లో ఒక సారూప్యత రాకుండా బీజేపీని విపక్షాలు ఓడించజాలవని అన్నారు. భారత్ జోడో యాత్రపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
 

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని విపక్ష నేతలు కొందరు పిలుపు ఇస్తున్నారు. కానీ, వాటి మధ్యలోనే ఇప్పటికీ సఖ్యత కుదరలేదు. ఈ తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు విపక్షాల ఐక్యత సాధ్యం కాదని ఆయన అన్నారు. ఎందుకంటే విపక్షాలు అస్థిరతతో, భావజాల విభేదాలతో సతమతం అవుతున్నాయని వివరించారు. అదే సందర్భంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రయోజనాలపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

‘బీజేపీని సవాల్ చేయాలనుకుంటే.. ముందు దాని బలాలను అర్థం చేసుకోవాలి. హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమవాదం దాని బలాలు. ఇది మూడంచెల పిల్లర్. ఇందులో కనీసం రెండు అంచెలనైనా ఢీకొట్టకుండా బీజేపీని సవాల్ చేయడం సాధ్యం కాదు’ అని ప్రశాంత్ కిశోర్ ఎన్డీటీవీతో అన్నారు.

‘హిందుత్వ భావజాలంతో పోరాడాలని అనుకుంటే భావజాలాల ఏకీకరణ అవసరం. గాంధీవాదులు, అంబేద్కర్ వాదులు, సామ్య వాదులు, కమ్యూనిస్టులు... భావజాలం చాలా ముఖ్యమైనది. కానీ, భావజాల పునాదిగా అంధ విశ్వాసం ఉండవద్దు’ అని తెలిపారు.

Also Read: భోపాల్‌లో డ్యాన్స్ చేస్తూనే స్టేజీపై కుప్పకూలి ఓ ప్రభుత్వ ఉద్యోగి హఠాన్మరణం.. వైరల్ వీడియో ఇదే

‘మీ మీడియా వారంతా పార్టీలు, పార్టీల నేతలు ఒక చోట చేరితే విపక్షల కూటమి ఏర్పడ్డట్టు చూస్తుంటారు. ఎవరు ఎవరితో లంచ్ చేశారు. ఎవరు ఎవరికీ తేనీటి విందు ఇచ్చారు.. ఇవి కూటములను నిర్దారించలేవు. నేను భావజాలాల ఏర్పాటు చూస్తాను. అప్పటి వరకు భావజాలాల కూటములు జరగవు. అప్పటి వరకు బీజేపీని ఓడించడం సాధ్యం కాదు.’ అని వివరించారు.

తనను తాను మహాత్మా గాంధీ భావజాలం కలిగినవాడిగా చెప్పుకున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర గురించి మాట్లాడుతూ, ‘ఇది కేవలం నడవడమే. ఆరు నెలల భారత్ జోడో యాత్రలో ఎన్నో ప్రశంసలు చూశాం.. విమర్శలూ వచ్చాయి. ఆరు నెలల పాదయాత్ర తర్వాత మనం కచ్చితంగా కొంత మార్పును చూడాలి? ఈ యాత్ర కేవలం పార్టీ ఎన్నికల ప్రయోజనాల కోసమే. నేను నా యాత్రలో కేవలం నాలుగు జిల్లాలను మాత్రమే కవర్ చేయగలిగాను. ఎందుకంటే నా దృష్టిలో యాత్ర అంటే మిషన్ కాదు. అది ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడం’ అని వివరించారు.

click me!