ఆ దొంగల ముఠా నాయకురాలిని పట్టుకోవడానికి పోలీసులకు చెమటలు పట్టాయ్.. 50 కిలోమీటర్ల చేజ్

By Mahesh KFirst Published Mar 20, 2023, 6:07 PM IST
Highlights

రాజస్తాన్‌లో ఓ లేడీ కిలాడిని పట్టుకోవడానికి పోలీసులకు చెమటలు పట్టాయి. 42 తులాల బంగారం చోరీ కేసులో దొంగల ముఠాకు లీడర్‌గా ఉన్న ఆ లేడీని పట్టుకోవడానికి పోలీసులు సుమారు 50 కిలోమీటర్లు కార్‌లో చేజ్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆమెను పట్టుకోగలిగారు.
 

జైసల్మేర్: కొందరు దొంగలు చోరీలను ఎంతో పకడ్బందీగా చేస్తారు. కానీ, పోలీసులకు చాలా సులువుగా దొరికిపోతారు. ఇంకొందరు మాత్రం పోలీసులకు చెమటలు పట్టిస్తారు. రాజస్తాన్‌కు చెందిన ఆ కిలాడీ లేడీ రెండో కోవకు చెందుతుంది. పోలీసులు ఆమెను పట్టుకోవడానికి 400 కిలోమీటర్లు వెతికారు. 200 సీసీటీవీలను పరిశీలించారు. చివరకు ఆమెను పట్టుకోవడానికి వెళ్లగా.. కారులో పరారైంది. సుమారు 50 కిలోమీటర్లు చేజ్ చేస్తే గానీ, ఆ దొంగల ముఠా నాయకురాలిని పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈ ఘటన జైల్మేర్‌లో చోటుచేసుకుంది.

ఆ దొంగల ముఠా 42 తులాల బంగారాన్ని దోచుకుంది. మార్చి 2వ తేదీన ఈ చోరీకి పాల్పడ్డ బవారియా గ్యాంగ్‌ను పట్టుకున్నామని ఆదివారం రాజస్తాన్ పోలీసులు తెలిపారు. 50 కిలోమీటర్లు చేజ్ చేసి ఆమెను పట్టుకుని కోర్టులో హాజరుపరిచామని వివరించారు. ఆమెను కోర్టు పోలీసు రిమాండ్‌కు పంపించింది.

ఎస్పీ బన్వర్ సింగ్ నతావత్ మాట్లాడుతూ, సనవాడా నివాసి ఆరబ్ ఖాన్ మార్చి 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. మార్చి 2వ తేదీ ఉదయం తమ కుటుంబం ఓ పెళ్లికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిందని చెప్పారు. వారు ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉన్నదని, లోనికి వెళ్లి చూస్తే 42 తులాల బంగారం చోరీకి గురైనట్టు తెలిసిందని ఫిర్యాదు చేశారు. 

Also Read: బిల్డర్లకు సద్గురు వార్నింగ్.. ‘అడ్డగోలుగా నిర్మాణాలు చేపడితే విపత్తు తప్పదు’

పోలీసులు ఈ కేసును చేదించారు. ఫులేరాకు చెందిన లక్ష్మా దేవికి ఈ చోరీలో ప్రధాన పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె జైపూర్‌లో ఉన్నట్టు కనుగొన్నారు. పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి వెళ్లగానే ఆమె కారు తీసి డ్రైవింగ్ చేసుకుంటూ పారిపోయిందని వివరించారు. సుమారు 50 కిలోమీటర్లు చేజ్ చేసి ఆమెను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి తాళం పగులగొట్టడానికి ఉపకరించే వస్తువులను రికవరీ చేసుకున్నారు. లక్ష్మా దేవి, ఆమె భర్తపైనా ఇతర చోరీ కేసులూ ఉన్నాయని వివరించారు. ఇతర నిందితులను గుర్తించామని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.

click me!