ఇండియా కూటమిలోని పార్టీకి గాలం వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్ఎల్డీకి ఏడు సీట్లు ఆఫర్ చేస్తూ సంధికి ప్రయత్నిస్తున్నది. ఆర్ఎల్డీ ప్రస్తుతం ఇండియా కూటమిలోని పార్టీ. యూపీలో ఎస్పీతో అవగాహనలో ఉన్నది.
INDIA Bloc: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇండియా కూటమి సారథ్య బాధ్యతల పంపకం, సీట్ల సర్దుబాటు విషయం వచ్చేసరికి పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. దీంతో ఒక్కో పార్టీ వరుసగా ఇండియా కూటమిపై విమర్శలు చేశాయి. టీఎంసీ వంటి పార్టీలు వెళ్లిపోయాయి. నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఏకంగా ఎన్డీయేలో చేరింది. దీంతో ఇండియా కూటమి అస్థిరపడింది. బీజేపీ దాన్ని ఇంకా కుళ్లబొడిచేలా ఉన్నది. ఇండియా కూటమిలోని ఓ పార్టీకి గాలం వేసే పనుల్లో ఉన్నట్టు కొన్ని వర్గాలు చెప్పాయి. ఆర్ఎల్డీకి ఐదు పార్లమెంటరీ సీట్లను, రెండు మంత్రి పదవులను ఇచ్చి మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపాయి.
పశ్చిమ యూపీలోని రైతులు, జాట్‌ల నుంచి బలమైన మద్దతు ఆర్ఎల్డీకి ఉన్నది. ప్రస్తుతం ఆర్ఎల్డీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య అవగాహన ఉన్నది. ఆర్ఎల్డీకి ఏడు పార్లమెంటరీ సీట్లలో పోటీకి ఎస్పీ అవకాశం ఇచ్చింది. కానీ, ఈ పార్టీని ఎన్డీయేలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుతున్నది. ఇందుకు ఆర్ఎల్డీకి రెండు లోక్ సభ, ఒక రాజ్యసభ సీటును ఇస్తామని హామీ ఇచ్చినట్టు, యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులనూ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే, మరో మూడు లోక్ సభ సీట్లు, కేంద్రంలో మంత్రి పదవి కోసం ఆర్ఎల్డీ డిమాండ్ చేస్తున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
Also Read: KCR: కేసీఆర్‌కు జగన్ పరిస్థితే! రెండు పార్టీలకూ అదే సవాల్
ఇదిలా ఉండగా.. ఆర్ఎల్డీ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించింది. ఆర్ఎల్డీ నేత రాజీవ్ మాలిక్ ఈ వార్తలు కొట్టివేశారు. అవన్నీ నిరాధారమైన వార్తలని పేర్కొంటూ.. పార్టీ కార్యకర్తలు వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం సన్నద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోబోరని, బీజేపీలో కలిసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. బీజేపీలో ఆర్ఎల్డీ కలువదని, ఇవన్నీ అవాస్తవ వార్తలు అని తెలిపారు.
ఎస్పీ చీఫ్ అకిలేశ్ యాదవ్ కూడా ఈ వార్తలను ఖండించారు. జయంత్ చౌదరి లౌకికవాది అని, ఆయన బీజేపీలో కలువరని పేర్కొన్నారు.