
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అందులో ఆమె భారత జాతీయ గీతాన్ని (national anthem) అవమానించేలా వ్యవహరించారని బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక రాష్ట్ర సీఎం దేశభక్తి ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ వీడియోను షేర్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా.. ‘మన జాతీయ గుర్తింపులో అత్యంత శక్తివంతమైన వాటిలో మన జాతీయ గీతం ఒకటి. ప్రభుత్వ పదవుల్లో ఉన్న అతి తక్కువ వ్యక్తులు దానిని కించపరచరు. మన జాతీయ గీతం యొక్క మ్యుటిలేట్ వెర్షన్ ఇక్కడ ఉంది.. దీనిని బెంగాల్ సీఎం పాడారు. భారతదేశ ప్రతిపక్షం గర్వం.. దేశభక్తిని కోల్పోయిందా..?’ అని ప్రశ్నించారు.
ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్ స్పందిస్తూ.. ‘ ముంబైలో జరిగిన సభలో రాజ్యాంగ పదవిలో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కూర్చొని జాతీయ గీతాన్ని పాడి అవమానించారు. ఆమెకు సరైన జాతీయ గీతం మర్యాద తెలియదా..?, లేక తెలిసే అవమానిస్తున్నారా.. ?’ అని ప్రశ్నించారు.
ఇక, ఈ వీడియో ముంబైలోని సివిల్ సొసైటీ సభ్యులతో మమతా బెనర్జీ సమావేశం అయినప్పుడు చోటుచేసుకుంది. ఈ సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మజీ మెమన్, ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్, దర్శకుడు మహేష్ భట్, నటి రిచా చద్దా, నటి స్వరా భాస్కర్, స్టాండప్ కమెడియన్ మునవర్ ఫరూఖీ పాల్గొన్నారు. అయితే ఆ వీడియోలో మమతా బెనర్జీ జాతీయ గీతం ప్రారంభిస్తున్న సమయంలో కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత లేచి నిల్చున్నారు. కానీ మధ్యలోనే జాతీయ గీతాన్ని ముగించారు.
Also read: యూపీఏది ముగిసిన చరిత్ర: శరద్ పవార్‌తో బెంగాల్ సీఎం మమత బెనర్జీ భేటీ
మమతా బెనర్జీపై పోలీసులకు ఫిర్యాదు..
ఈ వీడియో వైరల్‌గా మారిన తర్వాత ముంబైకి చెందిన బీజేపీ నాయకుడు ఒకరు మమతా బెనర్జీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని పూర్తిగా అగౌరవపరిచారు. కూర్చొన్న స్థానంలో తొలుత ఆలపించి.. నాలుగైదు లైన్లు పాడిన తర్వాత అకస్మాత్తుగా ఆపివేశారు’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా ఏఎన్‌ఐ వార్త సంస్థ తెలిపింది.