ఢిల్లీపై చలి పంజా.. పొగమంచు ఎఫెక్ట్‌తో పలు రైళ్లు, విమానాలు ఆలస్యం.. స్కూల్స్‌కు ఈనెల 15 వరకు సెలవులు..!

By Sumanth KanukulaFirst Published Jan 9, 2023, 10:54 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసురుతోంది. సోమవారం ఉదయం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే రెండు రోజులు కూడా వాయువ్య భారతదేశంలో చలిగాలులు, చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. 
 

దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసురుతోంది. ఆదివారం ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రత 1.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గత 10 సంవత్సరాలలో ఇది రెండవ కనిష్ట ఉష్ణోగ్రత అని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. సోమవారం ఉదయం సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో కనిష్ట ఉష్ణోగ్రత 3.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. లోధి రోడ్‌ వాతావరణ స్టేషన్‌లో 3.6 డిగ్రీలు, అయానగర్‌ వాతావరణ స్టేషన్‌లో 3.2 డిగ్రీలు,  రిడ్జ్‌ వాతావరణ స్టేషన్‌లో 3.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటే.. చలిగాలుల నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలను జనవరి 15 వరకు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. 

భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. రాబోయే రెండు రోజులు కూడా వాయువ్య భారతదేశంలో చలిగాలులు, చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఉత్తర,  మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. 

ఈరోజు ఉదయం ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో దట్టమైన పొగమంచు పరిస్థితులు నెలకొన్నాయి. సమీపంలోని వస్తువులు కూడా కనిపించకుండా పోయాయి. ఈ క్రమంలోనే కనీసం 29 రైళ్లు,  118 దేశీయ విమానాలు ఆలస్యం అయ్యాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలోని రోడ్లపై వాహనాలు లైట్ల వెలుతురులో నెమ్మదిగా కదులుతూ కనిపంచాయి. 

click me!