షార్జా వెళ్లాల్సిన ఫ్లైట్‌‌ ఇంజిన్‌ను ఢీకొన్న పక్షి.. కోయంబత్తూర్‌లోనే ఆగిపోయిన విమానం

By Mahesh KFirst Published Jan 2, 2023, 7:30 PM IST
Highlights

షార్జాకు వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా విమానాన్ని రెండు పక్షులు ఢీకొన్నాయి. టేకాఫ్ కావడానికి కొద్ది సమయం ముందే ఈ ఘటన జరగడంతో విమానం కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. నష్టాన్ని సమీక్షించడానికి ప్రయాణికులందరినీ విమానం నుంచి దింపేశారు.
 

చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి షార్జా (యూఏఈ)కు వెళ్లాల్సిన విమానాన్ని ఈ రోజు ఉదయం ఓ పక్షి ఢీకొట్టింది. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో షార్జాకు బయల్దేరుతున్న ఎయిర్ అరేబియా విమానం టేకాఫ్ కావడానికి కొద్ది సమయం ముందర పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమానం టేకాఫ్‌ను రద్దు చేసుకుంది. 

164 ప్రయాణికులతో ఎయిర్ అరేబియా విమానం టేకాఫ్ కావడానికి రన్ వే వైపు వెళ్లుతున్నది. మరికాసేపట్లో అది టేకాఫ్ అయ్యేదే. కానీ, ఇంతలోనే రెండు డేగలు అటువైపుగా వచ్చాయి. అవి విమానం ఎడమ వైపు ఉన్న ఇంజిన్‌ను ఢీకొన్నాయి. ఇందులో ఒక పక్షిని ఇంజిన్ బ్లేడ్ బలంగా తాకింది. దీంతో ఆ పక్షి మృత్యువాత పడింది.ఆ ఇంజిన్‌ను మార్చాల్సి ఉన్నదని అధికారవర్గాలు తెలిపాయి. 

ఆ పక్షి విమానం ఇంజిన్‌ను ఢీకొని చనిపోవడం, టేకాఫ్‌ను ఫ్లైట్ రద్దు చేసుకున్న తర్వాత అందులోని ప్రయాణికులు అందరూ కిందికి దిగారు. అందులో కొంత మంది మోటెల్స్‌కు వెళ్లిపోయారు. మరికొందరు సిటీలోని తమ నివాసాలకు వెళ్లిపోయారు.

Also Read: థాయ్ స్మైల్ ఎయిర్‌ వేస్ లో ప్రయాణీకుల మధ్య కొట్లాట... నివేదిక కోరిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ..

పక్షి కారణంగా జరిగిన నష్టాన్ని సమీక్షించడానికి విమానం నుంచి ప్రయాణికులను అందరినీ దింపేయడం కోయంబత్తూర్‌ లో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. కోయంబత్తూర్‌లో పక్షుల బెడద ఎక్కువగా ఉన్నది. గత ఏడేళ్లుగా చూస్తే ప్రతి యేటా సగటున మూడు ఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి.

కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎస్ సెంథిల్ వాలావన్ మీడియాతో మాట్లాడుతూ, పక్షుల ప్రమాదాలను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బర్డ్ కేర్ గన్స్, బర్డ్ చేజర్లను మోహరించడం, మొక్కల పెరుగుదలను నియంత్రించే హెర్బిసైడ్స్‌ను వినియోగించడం వంటి చర్యలు తీసుకుంటామని వివరించారు.

విమానం ఇంజిన్ సమస్య పరిష్కరించిన తర్వాత ఆ ఫ్లైట్ టేకాఫ్ అవుతుందని ఈ రోజు ఉదయం టెక్నికల్ నిపుణులు తెలిపారు.

click me!