
తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో (Army chopper crash) సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (Bipin Rawat), ఆయన సతీమణి మధులికా రావత్‌తో సహా 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. వారి భౌతికకాయాలను గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval), త్రివిధ దళాల అధిపతులు నివాళులర్పించారు. అయితే ప్రమాదంలో మృతదేహాలన్నీ బాగా కాలిపోవడంతో.. వాటిని గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటివరకు కేవలం బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ భౌతికకాయలను మాత్రమే గుర్తించగలిగారు. దీంతో వారి భౌతికకాయాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మిగిలిన వారి మృతదేహాలను ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ భౌతిక కాయాలను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. డీఎన్‌ఏ పరీక్షల కోసంప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల నుంచి నమునాలను సేకరిస్తున్నారు. డీఎన్‌ఏ (DNA) ఆధారంగా గుర్తింపు ప్రక్రియ పూర్తికాగానే.. వారి కుటుంబీకులకు భౌతికకాయాలను అప్పగించనున్నారు. అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు వీలుగా.. ఐడెంటిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు వేగంగా పనిచేస్తున్నట్టుగా రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక, ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్‌కు ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం తర్వాత వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రికి వరుణ్ సింగ్‌ను తరలించారు. అయితే గురువారం మెరుగైన చికిత్స కోసం.. వెల్లింగ్టన్ ఆస్పత్రి నుంచి అంబులెన్స్ ద్వారా సూలూరు ఎయిర్‌బేస్‌కు తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో చెప్పారు. మరోవైపు తన కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వరుణ్ సింగ్ తండ్రి రిటైర్డ్ కల్నల్ కేపీ సింగ్ తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో హెలికాఫ్టర్‌లో ఉన్నవారు వీరే..
1. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్
2. బిపిన్ రావత్ సతీమణి మధులికా రావత్
3. లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్
4. బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్
5. వింగ్ కమాండర్ పీఎస్ చౌహన్
6. స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్
7. జూనియర్ వారెంట్ ఆఫీసర్ ప్రదీప్ అరక్కల్
8. జూనియర్ వారెంట్ ఆఫీసర్ రాణా ప్రతాప్ దాస్
9. సీడీఎస్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా అధికారి హవిల్దార్ సత్పాల్
10. లాన్స్ నాయక్ వివేక్ కుమార్
11. లాన్స్ నాయక్ సాయి తేజ
12. నాయక్ జితేందర్ కుమార్
13. నాయక్ గుర్ సేవక్ సింగ్
14. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు)