
న్యూఢిల్లీ: మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెలా చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100వ ఎపిసోడ్ పూర్తి కానుంది. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ తన మనసులోని మాటలనే కాకుండా.. తరుచుగా భారతదేశం అంతటా స్ఫూర్తిదాయకమైన కథనాలను పంచుకుంటుంటారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రధాని మోదీకి మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అభినందను తెలిపారు.
మన్ కీ బాత్ పారిశుధ్యం, ఆరోగ్యం, మహిళల ఆర్థిక సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఇతర సమస్యలపై కమ్యూనిటీ నేతృత్వంలోని చర్యను ఉత్ప్రేరకపరిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా భారతదేశం ప్రయత్నాలను ప్రోత్సహిస్తుందని చెబుతున్న ఓ న్యూస్ ఆర్టికల్ కూడా బిల్ గేట్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక, ఇటీవల భారత్‌లో పర్యటించిన బిల్ గేట్స్.. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అసమానతలను తగ్గించడంలో సైన్స్, ఆవిష్కరణలు ఎలా సహాయపడతాయనే దాని గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. తన పర్యటనలో భాగంగా.. ఆరోగ్యం, వాతావరణ మార్పులు, ఇతర కీలకమైన రంగాలలో భారత్‌లో జరుగుతున్న వినూత్న పని గురించి తెలుసుకున్నానని పేర్కొన్నారు. అలాగే భారత్ జీ20 ప్రెసిడెన్సీ గురించి కూడా ప్రధాని మోదీతో చర్చించినట్టుగా తెలిపారు. ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం వంటి రంగాలలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఆవిష్కరణలో పెట్టుబడులు పెట్టినప్పుడు ఏమి సాధ్యమవుతుందనేది భారత్ చూపుతోందని కొనియాడారు.