
బీహార్ కల్తీ మద్యం మరణాలు: బీహార్‌లో చప్రా,సరన్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి 70 మందికి పైగా మరణించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్‌లో 2016 ఏప్రిల్‌లోనే సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించారు. కానీ.. ఆ తర్వాత రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి అనేక మంది మృత్యువాత పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిషేధం తర్వాత ఐదేళ్లలో బీహార్‌లో కల్తీ మద్యం కారణంగా 200 మందికి పైగా మరణాలు సంభవించాయి. కానీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా 23 మంది మాత్రమే చనిపోయినట్టు చూపిస్తుంది.
2016లో బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలోని ఖజుర్బానీలో కల్తీ మద్యం సేవించి ఆగస్టు 16 -18 మధ్య కాలంలో 19 మంది చనిపోయారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత నమోదైన తొలి కేసు ఇదే.కానీ ఎన్‌సిఆర్‌బి డేటా మాత్రం కేవలం ఆరు మంది మాత్రమే చనిపోయినట్టు చూపిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వాస్తవానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా NCB డేటాను తయారు చేశారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అలాగే.. ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం, 2016లో ఆరు మంది, 2017లో ఎలాంటి మరణాలు లేవు,2018లో ఎలాంటి మరణాలు లేవు, 2019లో తొమ్మిది మంది, 2020లో ఆరుగురు, 2021లో ఇద్దరు కల్తీ మద్యం కారణంగా మరణించారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
20 కేసుల్లో 200 మంది చనిపోయారు
పలు మీడియా నివేదికల ప్రకారం.. 2016 నుండి 2021 వరకు బీహార్‌లో కనీసం 20 కల్తీ మద్యం ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో సుమారు 200 మంది మరణించారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విశ్లేషణ ప్రకారం.. 2021లోనే తొమ్మిది కల్తీ మద్యం ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 106 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే..2021లో భాగల్పూర్‌లో 22 మరణాలు, గోపాల్‌గంజ్‌లో 20 మరణాలు, అలాగే అదే ఏడాది నవంబర్ 3.4 తేదీలలో గోపాల్‌గంజ్‌లో 15 మరణాలు నమోదయ్యాయి.
సరన్‌లో 70 మందికి పైగా ..
బీహార్ శాసనసభలో నిషేధాజ్ఞలపై వచ్చిన విమర్శలకు సీఎం నితీశ్ కుమార్ సమాధానమిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో కల్తీ మద్యం కారణంగా మరణాలను ప్రస్తావించారు. సరన్ ఘటనలో 70 మందికి పైగా మరణించారు. ఇది కాకుండా, సివాన్‌లో గత మూడు రోజుల్లో ఐదుగురు నకిలీ మద్యంతో మరణించారు. ఓ నివేదిక ప్రకారం..జనవరి 2022నుండి డిసెంబర్ వరకూ 10 కల్తీ మద్యం కేసులు నమోదయ్యాయి, ఇందులో సరన్ లో రెండు,నలంద లో మూడు ఘటనలు నమోదయ్యాయి. మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు. మరోవైపు బీహార్‌లో కల్తీ మద్యం వల్ల జరిగిన మరణాలపై దర్యాప్తునకు దర్యాప్తు బృందాన్ని పంపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ణయించింది.