ఊరిలోని మహిళలందరి బట్టలు ఉతికి ఐరన్ చేయ్.. అత్యాచారయత్నం కేసులో కోర్టు షాకింగ్ ఆర్డర్

By telugu teamFirst Published Sep 24, 2021, 12:41 PM IST
Highlights

అత్యాచారయత్నం కేసులోని నిందితుడికి బిహార్‌లో మధుబాని కోర్టు అందరిని విస్మయపరిచే ఆదేశాలనిచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఆరు నెలలపాటు బాధితురాలు సహా ఆ గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతికి ఐరన్ చేసి ఇవ్వాలని శిక్ష వేసింది. అనంతరం ఏప్రిల్ నుంచి పోలీసుల కస్టడలో ఉన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.

న్యూఢిల్లీ: అత్యాచారయత్నం(Rape attempt) కేసులో ఓ కోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది. నిందితుడిని ఆ ఊరిలోని మహిళలందరి బట్టలు(Clothes) ఉతికి(Wash) ఐరన్ చేయాలని ఆదేశించింది. ఆరు నెలలపాటు ఈ సర్వీస్ చేయాలని ఆర్డర్ చేసింది. నిందితుడికి కేసు నుంచి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వినూత్న శిక్ష వేసింది. బిహార్‌లో మధుబానిలోని ఓ కోర్టు(Court) ఈ సంచలన తీర్పు చెప్పింది.

బిహార్‌కు చెందిన లలన్ కుమార్ సఫీ ఓ మహిళపై అత్యాచారానికి యత్నించాడు. దీనిపై బాధితురాలు కేసు నమోదు చేయగా, మధుబాని కోర్టు కేసు విచారించింది. ఈ కేసులో ఏప్రిల్‌లో సఫీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తాజాగా, సఫీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. నిందితుడు 20ఏళ్ల యువకుడే కాబట్టి, క్షమించి వదిలిపెట్టాలని సఫీ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించడం గమనార్హం. అంతేకాదు, నిందితుడు సమాజానికి సేవ చేయాలని భావిస్తున్నాడని తెలిపారు. ఆయన ప్రొఫెషన్ రీత్య ఆ సహాయం చేస్తాడని వివరించారు. ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

బాధితురాలు సహా ఆ ఊరిలోని మహిళలందరి బట్టలను ఆరు నెలలపాటు ఉచితంగా ఉతికి ఐరన్ చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, రూ. 10వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని తెలిపింది. ఇదిలా ఉండగా పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ ఫైల్ చేసి దర్యాప్తు పూర్తి చేశారు. ఇరువర్గాల మధ్య సెటిల్‌మెంట్ అప్లికేషన్‌ కూడా మూవ్ అయింది. ఆరు నెలల తర్వాత నిందితుడి ఊరిలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతికి ఐరన్ చేసినట్టు ధ్రువీకరించే పత్రాన్ని సర్పంచ్ లేదా ఇతర ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. తాజాగా అత్యాచారయత్నం కేసులో ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది.

ఏడీజే అవినాశ్ కుమార్ ఇలాంటి విచిత్ర ఆదేశాలకు కేరాఫ్‌గా మారారు. గతంలోనూ లాక్‌డౌన్ వేళ స్కూల్ తెరిచారని ఓ ఉపాధ్యాయుడిని ఆ ఊరిలోని పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పాలని ఆదేశించి వార్తలకెక్కారు.

click me!