2014లో గెలిచారు కానీ... 2024లో అసాధ్యం : మోడీపై నితీశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 10, 2022, 3:20 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయన 2014లో గెలిచారు కానీ... 2024లో మాత్రం కష్టమన్నారు. తాను పూర్తి కాలం పదవిలో వుంటానో లేనో అన్న దానిపై బీజేపీ వాళ్లు ఏమైనా మాట్లాడొచ్చన్నారు. 

బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మోడీ 2014లో గెలిచారు కానీ... 2024లో మాత్రం గెలవలేరని జోస్యం చెప్పారు. తాను పూర్తి కాలం పదవిలో వుంటానో లేనో అన్న దానిపై బీజేపీ వాళ్లు ఏమైనా మాట్లాడొచ్చన్నారు. ఆర్జేడీతో మా పొత్తు ఎక్కువ కాలం నిలబడలేదన్న బీజేపీ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు నితీశ్. 

మరోవైపు .. మహాఘట్‌బంధన్ కూటమి సర్కార్ కొలువు దీరిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణం స్వీకారం చేశారు. ఏడు పార్టీల కూటమితో నితీశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకాలం ఎన్డీయేతో జతకట్టిన నితీశ్ ఆ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే.. నితీష్ కుమార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి వైదొల‌గాల‌ని నిర్ణయించుకున్నప్పటికీ, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) భారతీయ జనతా పార్టీ (BJP)తోనే ఉంటుందని మంగ‌ళ‌వారం ప్రకటించింది. ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి పశుపతి పరాస్ వార్తా సంస్థ ANIతో వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జేడీ(యూ), ఆర్జేడీలు ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేవ‌ని అన్నారు. 

Also REad:బీహార్ రాజ‌కీయాలు.. నితీష్ కుమార్ పొలిటిక‌ల్ ఎత్తుగడపై రాజకీయ నేతలు ఏమ‌న్నారంటే...?

ఇంతకు ముందు కూడా RJD, JD(U) మధ్య ఒక ప్రయోగం జరిగింది. కానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. మళ్లీ అలాంటి పొత్తు రావడం బీహార్ అభివృద్ధికి మంచి సంకేతం కాదు. మా పార్టీ ఎన్డీఏలో ఒక భాగంగా ఉంటుందని మేము నిర్ణయించుకున్నాము. ’’ అని పశుపతి పరాస్ అన్నారు. 

కాగా.. గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. ఎన్డీయే కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం జేడీయూ ఎమ్మెల్యేల, ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను అందజేశారు. ఆ తర్వాత నితీష్ కుమార్ నేరుగా రబ్రీదేవి ఇంటికి చేరుకున్నారు. అక్కడ జేడీయూ, ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహాకారం అందిస్తున్నందుకు నితీష్ కుమార్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఫోన్ చేసి థాంక్స్ చెప్పినట్టుగా సమాచారం. 

click me!