నితీశ్ నన్ను మళ్లీ పిలిపించారు... పనిచేయనని తేల్చిచెప్పేశా : ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 4, 2022, 9:45 PM IST
Highlights

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ తనను మరోసారి పిలిపించి పనిచేయాలని సూచించారని.. కానీ తాను జన సురాజ్ యాత్రపైనే ఫోకస్ పెట్టినట్లు పీకే తెలిపారు. 

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌పై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సురాజ్ యాత్రలో భాగంగా మూడో రోజు బీహార్‌లోని చంపారన్, జమునియాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పీకే మాట్లాడుతూ.. నితీశ్ తనను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారని బాంబు పేల్చారు. అయితే తాను జేడీయూ కోసం పనిచేయలేనని ముఖ్యమంత్రితో చెప్పినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నితీశ్ ఘోర పరాజయాన్ని చూశారని.. కానీ 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం తామిద్దరం చేతులూ కలిపామని పీకే గుర్తుచేశారు. ప్రస్తుతం తాను జన సురాజ్ యాత్ర చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నానని.. తన యాత్ర కోసం గతంలో పనిచేసిన ఏ పార్టీ నుంచి నిధులు తీసుకోలేదని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. తన తెలివితేటలతో పదేళ్ల పాటు కష్టపడి పనిచేశానని.. దళారీగా వుండలేదని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు.. ప్రశాంత్ కిషోర్ భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌ఫున ప‌నిచేస్తున్నార‌ని జేడీయూ ఆరోపించింది. అలాగే, ఆయ‌న చేప‌ట్టిన బీహార్ రాష్ట్రవ్యాప్త యాత్ర‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. జేడీ(యూ) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ కూడా కిషోర్ రాష్ట్రవ్యాప్త పాద యాత్రపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. నితీష్ కుమార్ సుపరిపాలన గురించి, ఒక దశాబ్దం పాటు బీహార్ వెనుకబడి ఉందని చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. నితీష్‌ కుమార్‌ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో బీహార్‌ ప్రజలకు తెలుసున‌ని ఆయ‌న పేర్కొన్నారు.  ప్రశాంత్ కిషోర్ నుండి మాకు సర్టిఫికేట్  తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇతర పౌరుల మాదిరిగానే అతను మార్చ్ లేదా ప్రదర్శన చేయడానికి స్వేచ్ఛగానే ఉన్నాడ‌ని అన్నారు. 

ALso REad:తెర‌వెనుక‌గా బీజేపీకి ప‌నిచేస్తున్న ప్ర‌శాంత్ కిషోర్: జేడీ(యూ)

ఇకపోతే.. ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ యాత్ర పేరిట 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2 నుంచి ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. దీని తర్వాత కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని పీకే ప్రకటించారు. ప్రశాంత్‌కు నితీశ్‌తో సత్సంబంధాలే వుండేవి.. జేడీయూ ఉపాధ్యక్ష పదవిని సైతం ప్రశాంత్‌ నిర్వహించారు. కానీ అనుకోని కారణాలతో జేడీయూ నుంచి పీకేను బహిష్కరించాను నితీశ్. 

click me!