నేను కచ్చితంగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని రాహుల్ గాంధీ చెప్పాడు: శశిథరూర్

By Mahesh KFirst Published Oct 4, 2022, 9:22 PM IST
Highlights

కాంగ్రెస్ చీఫ్ రేసులో ఉన్న శశిథరూర్ సంచలన కామెంట్లు చేశారు. తాను కచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధి చెప్పాడని వివరించారు. పోటీ నుంచి తప్పుకోవాలని కొందరు సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి ఫిర్యాదు అయ్యారని, కానీ, రాహుల్ గాంధీ మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.
 

తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్న సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కచ్చితంగా అధ్యక్ష పదవికి పోటీ చేయాలని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారని వివరించారు. ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన కేరళలో ఈ రోజు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీకి, ఆయనకు మధ్య జరిగిన సంభాషణలను ప్రస్తావించారు.

‘అధ్యక్ష రేసు నుంచి నన్ను తప్పించాలని చాలా మంది సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. ఆయన ద్వారా నన్ను ఉపసంహరించుకోవాలని చెప్పించాలనుకున్నారు. కానీ, రాహుల్ గాంధీ వారి విజ్ఞప్తులను పట్టించుకోలేదని చెప్పారు. నేను ఉపసంహరించుకోవద్దని అన్నారు. కచ్చితంగా పోటీ చేయాలనే నన్ను కోరారు. నా పోటీ కూడా పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు’ అని శశిథరూర్ వివరించారు.

ఇదిలా ఉండగా కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్ కే సుధాకరణ్.. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీ శశిథరూర్‌కు కాకుండా మల్లికార్జున్ ఖర్గేకు మద్దతు తెలిపారు. ‘తన పార్టీకి చెందిన పెద్ద నేతల నుంచి మద్దతు ఎప్పుడూ ఆశించలేదు. ఇప్పుడూ ఆశించడం లేదు. కానీ, నేను నాగ్‌పూర్, వార్దా, హైదరాబాద్‌లోనూ పార్టీ కార్యకర్తలతో కలిశాను. వారు నన్ను కచ్చితంగా అధ్యక్షుడిగా పోటీ చేయాలని కోరారు. వారిని మోసం చేయలేను’ అని తెలిపారు.

కే సుధాకరణ్ తన వ్యాఖ్యలతో డిస్కరేజ్ చేస్తున్నారని అడగ్గా.. అయితే కావొచ్చు అని అన్నారు. కానీ, ఆ విషయాన్ని తాను చెప్పడం లేదని, ఏది ఎలా ఉన్నప్పటికీ బ్యాలెట్ మాత్రం రహస్యమే అని చెప్పగలను అని వివరించారు. ఎవరికి ఎవరు ఓటు వేశారు అనే విషయం తెలియదని, వారు వారి ఇష్టాలకు అనుగుణంగా ఓటు వేసుకోవచ్చని తెలిపారు.

click me!