
Bihar Assembly Elections 2025 : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన మొదటిదశ పోలింగ్ గురువారం (నవంబర్ 6న) సాగనుంది. మొదటి దశ పోలింగ్ లో ఓటర్లు తమ తీర్పును ఈవిఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.ఈ దశలో పలువురు కీలక నేతలు బరిలో ఉన్నారు.
ఈ ఫస్ట్ ఫేజ్ లోనే మహాకూటమి సీఎం అభ్యర్థి, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్, ఆయన అన్న తేజ్ ప్రతాప్ యాదవ్, గాయకుడు, నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఖేసరి లాల్ యాదవ్, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి లాంటి పెద్ద నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు. ఏ సీటులో ఎలాంటి పోటీ ఉంది, ఓట్ల లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం...
మొదటి దశలో అతిపెద్ద పోటీ ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, 2010లో తేజస్వి తల్లి రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీష్ కుమార్ మధ్య ఉంది. రాఘోపూర్ సీటు నుంచి వరుసగా మూడోసారి గెలవాలనే లక్ష్యంతో తేజస్వి యాదవ్ బరిలోకి దిగారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ నుంచి చంచల్ సింగ్ కూడా ఇదే సీటు నుంచి పోటీ చేస్తున్నారు.
మరోవైపు లాలు ప్రసాద్ యాదవ్ మరో తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సీటులో బహుముఖ పోటీ ఉంది. తేజ్ ప్రతాప్ తన కొత్త పార్టీ జనశక్తి జనతా దళ్‌ను స్థాపించి మహువా సీటు నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు ప్రస్తుత ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ నుండి పెద్ద సవాల్ ఎదురవుతోంది . ఈ సీటులో లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి చెందిన సంజయ్ సింగ్, స్వతంత్ర అభ్యర్థి అష్మా పర్వీన్ పోటీతో రసవత్తరంగా మారింది.
తొలి దశలో బీహార్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, స్వయంగా ఉప ముఖ్యమంత్రి సీటుపై కూడా అందరి దృష్టి ఉంది. ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి, సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత మంగళ్ పాండే తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సివాన్ సీటులో ఆయన ఆర్జేడీకి చెందిన అవధ్ బిహారీ చౌదరితో తలపడుతున్నారు.
రఘునాథ్‌పూర్: దివంగత బాహుబలి నేత మహమ్మద్ షాహాబుద్దీన్ కుమారుడు ఒసామా షహాబ్ బరిలో ఉన్నారు. దీన్ని ఎన్డీఏ జంగిల్‌రాజ్ పునరాగమనంగా అభివర్ణించింది.
మొకామా: జైలులో ఉన్న జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్, బాహుబలి సూరజ్‌భన్ సింగ్ భార్య, ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవితో తలపడుతున్నారు.
ఛప్రా: భోజ్‌పురి స్టార్ ఖేసరి లాల్ యాదవ్ ఆర్జేడీ తరఫున పోటీ చేస్తున్నారు.
కరగహర్: భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు.
అలీగంజ్: జానపద గాయని మైథిలీ ఠాకూర్ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు.