గుజరాత్ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం.. పెండింగ్‌లోనే క్యాబినెట్

By telugu teamFirst Published Sep 13, 2021, 2:55 PM IST
Highlights

గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో ప్రమాణం చేయించగా, కేంద్ర మంత్రులు అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయా, ప్రహ్లాద్ జోషీలు సహా పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
 

అహ్మదాబాద్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనతో ప్రమాణం చేయించారు. భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, మన్సుఖ్ మాండవీయా, ప్రహ్లాద్ జోషిలు హాజరయ్యారు. వీరితోపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లూ పాల్గొన్నారు.

అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ ఆలయంలో భూపేంద్ర పటేల్ గోపూజ చేశారు. అనంతరం ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరో 15 నెలల్లో జరగనున్న తరుణంలో విజయ్ రూపానీ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా వెంటనే బీజేపీ శాసనసభా పక్షం భూపేంద్ర పటేల్‌ను సీఎం పదవికి ఎన్నుకుంది. అనంతరం గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

విజయ్ రూపానీ రాజీనామాతో మంత్రిమండలి కూడా రద్దయిపోయింది. సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం చేసినప్పటికీ ఇంకా క్యాబినెట్ కూర్పు మిగిలే ఉంది. మంత్రివర్గ సభ్యుల ఎంపిక పూర్తయిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం జరగనుంది. త్వరలోనే వారి ప్రమాణం ఉంటుందని సంబంధితవర్గాలు వెల్లడించాయి.

click me!