భీమా కోరేగావ్‌ కేసు: అప్పటి వరకు జైలులో లొంగిపోనక్కర్లేదు.. వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట

By Siva KodatiFirst Published Sep 24, 2021, 7:51 PM IST
Highlights

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న విరసం నేత వరవరరావుకు స్వల్ప ఊరట లభించింది. అక్టోబర్‌ 14 వరకు ముంబయిలోని తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో వరవరరావుకు మరికొన్ని రోజులు ఉపశమనం కలిగినట్లు అయ్యింది.  

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్‌ కేసులో విచారణ ఖైదీగా ఉన్న విరసం నేత వరవరరావుకు స్వల్ప ఊరట లభించింది. తన బెయిల్‌ పొడిగించాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అక్టోబర్‌ 14 వరకు ముంబయిలోని తలోజా జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో వరవరరావుకు మరికొన్ని రోజులు ఉపశమనం కలిగినట్లు అయ్యింది.  

ఎల్గర్‌ పరిషత్‌ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఆరు నెలలపాటు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సంగతి  తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న విడుదలైన ఆయన సెప్టెంబర్‌ 5న తిరిగి లొంగిపోవాలని సూచించింది. తాజాగా ఆ గడువు ముగియడంతో తన బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఈ నెల మొదటి వారంలో వరవరరావు బాంబే హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విచారణను సెప్టెంబర్‌ 24 వాయిదా వేసింది. 

మరోసారి గడువు పూర్తి కావడంతో వరవరరావు బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే, జస్టిస్‌ ఎన్‌జే జమాదార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, సమయం తక్కువ ఉండడం వల్ల ఈ పిటిషన్‌ విచారణను అక్టోబర్‌ 14కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న హైకోర్టు ధర్మాసనం.. అప్పటివరకూ లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అటు ఇదే వ్యవహారంలో కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ.. ప్రస్తుతం వరవరరావు ఆరోగ్యంగానే ఉన్నందున బెయిల్‌ పొడిగించకూడదని కోర్టుకు సూచించింది. 
 

click me!