నెక్స్ట్ టార్గెట్ రాజస్తాన్? రాహుల్‌తో సచిన్ పైలట్ భేటీ.. క్యాబినెట్ మార్పులుంటాయన్న ఇన్‌చార్జ్

By telugu teamFirst Published Sep 24, 2021, 7:38 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నది. పంజాబ్‌లో పరిస్థితులను చక్కబెట్టిందో లేదో మరో రాష్ట్రం రాజస్తాన్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాజస్తాన్‌‌ ప్రభుత్వంలో భారీ మార్పులు జరిగే అవకాశముందని సమాచారం. ఇప్పటికే క్యాబినెట్‌లో మార్పులుంటాయని రాజస్తాన్ ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సచిన్ పైలట్ ఢిల్లీలో సమావేశమయ్యారు. వారంలో రెండో సారి భేటీ కావడం ఈ వాదనలను బలపరుస్తున్నాయి.

న్యూఢిల్లీ: పంజాబ్‌(Punjab)లో అనూహ్య రాజకీయ పరిణామాలు జరిగిన రోజుల వ్యవధిలోనే మరో రాష్ట్రంలోనూ ఇలాంటి మార్పులు జరిగే అవకాశముందన్న సంకేతాలు వస్తున్నాయి. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త సీఎం ఫేస్‌ను కాంగ్రెస్(Congress) ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి ఓ మార్గాన్ని ఎంచుకున్నట్టయింది. ఇదే పాచికను రాజస్తాన్‌(Rajasthan)లోనూ వేయనున్నట్టు తెలుస్తున్నది. రాజస్తాన్‌లో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. రాజస్తాన్‌లో సీఎం పీఠం కోసం ఎదురుచూసి నిరాశను ఎదుర్కొన్న సచిన్ పైలట్(Sachin pilot) ఢిల్లీలో రాహుల్ గాంధీ(Rahul gandhi), ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. వారంలో ఆయన వీరితో రెండో సారి భేటీ కావడం గమనార్హం.

పంజాబ్‌లో చన్నీని సీఎంగా ఎంచుకుని రాహుల్ గాంధీ కొత్త మార్పులకు పార్టీ సిద్ధమేనన్న సంకేతాలనిచ్చారు. ఇదే సంకేతాలు ఇప్పుడు అటు రాజస్తాన్, ఇటు ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఊపిరినిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారమార్పిడి డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్‌లో సచిన్ పైలట్, ఛత్తీస్‌గడ్‌లో టీఎస్ సింగ్ డియోలు సీఎం కుర్చీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రులను మార్చి కొత్త ముఖాలను ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీతో సచిన్ పైలట్ సమావేశం జరిగిందని రాజకీయవర్గాలు చర్చిస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ మళ్లీ బలపడటానికి, పునరుత్తేజం గావించడానికి, అసెంబ్లీ సహా సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడానికి ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కాంగ్రెస్ అధినేతలు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన సమగ్ర వ్యూహాన్నీ ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే సోనియా గాంధీకి సమర్పించారు.

రాజస్తాన్‌ ప్రభుత్వంలో రానున్న రోజుల్లో భారీ మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలో రాజకీయాలు చల్లబడ్డాయి. కానీ, ప్రభుత్వంలో కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయని ఇప్పటికే కాంగ్రెస్ సంకేతాలనిచ్చింది. రాజస్తాన్ ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాలను తెలిపారు. రాజస్తాన్‌ క్యాబినెట్ విస్తరణతోపాటు భారీ మార్పులుంటాయని వెల్లడించారు.

click me!