
కోవిడ్‌పై పోరులో భారత్ మరో ముందడుగు వేసింది. కోవిడ్ నుంచి రక్షణ కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన నాసల్ వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా.. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఇది పెద్ద ప్రోత్సాహం అని పేర్కొన్నారు. 18 ఏళ్లు దాటిని వారికి నాజల్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించిందని చెప్పారు. ఇక, దేశంలో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్ కోవిడ్ టీకాగా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ నిలిచింది.
భారత్ బయోటెక్ ChAd36-SARS-CoV-S COVID-19రీకాంబినెంట్ నాసల్ వ్యాక్సిన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆమోదం లభించిందని మాన్సుఖ్ మాండవియా ట్వీట్ చేశారు. 18 ఏళ్లు పైబడినవారిలో కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రాథమిక రోగనిరోధకత కోసం అత్యవసర పరిస్థితుల్లో నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించిందని తెలిపారు. ఈ చర్య కరోనా మహమ్మారిపై మన సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కోవిడ్ వ్యతిరేక పోరాటంలో.. భారతదేశం తన సైన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మానవ వనరులను ఉపయోగించుకుందన్నారు. సైన్స్ ఆధారిత విధానం, అందరి కృషితో కోవిడ్‌ను ఓడిస్తామని చెప్పారు.