
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పార్టీ శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెలలో జరగనున్న ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై శశిథరూర్ స్పందించారు. ఆయన మంగళవారం ఓ ప్రకటన చేస్తూ.. వచ్చే నెలలో జరగనున్న పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో చాలా మంది పోటీ చేస్తారని ఆశిస్తున్నాను. నేను రేసు నుండి నన్ను మినహాయించలేదు లేదా నేను పాల్గొనలేదు. అంటూ అస్పష్టమైన సమాధానమిచ్చారు.
ఇదిలా ఉంటే.. ఆయన ఆదివారం ఢిల్లీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలిశారు. ఈ భేటీతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవి రేసులో శశిథరూర్ ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే తరుణంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి శశిథరూర్ పేరు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ ఇరువురు నేతల మధ్య భేటీ జరిగింది. ఈ ఊహాగానాల మధ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి శశిథరూర్ పోటీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కేరళ కాంగ్రెస్ చీఫ్ కె. సుధాకరన్ ప్రకటించారు. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీ. కాబట్టి అత్యున్నత పదవి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి సభ్యుడికి ఉందని అన్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే వారిని స్వాగతిస్తున్నాను- జైరాం
అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తే.. ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితా వస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ సోమవారం అన్నారు. జైరాం మాట్లాడుతూ,.. చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇది మంచి పరిణామమే.. ఈ విషయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. అక్టోబరు 17న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనున్నది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ ను సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభించనున్నది. ఈ యాత్రను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగి దాదాపు 150 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 3,570 కి.మీ. పాదయాత్ర చేపట్టానున్నారు. కాంగ్రెస్ పర్యటనతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులను, ఇతరులను ఏకం చేయగలదని, అందుకే ‘జోడో ఇండియా’, ‘జోడో కాంగ్రెస్’ రెండు లక్ష్యాలను సాధించవచ్చని కాంగ్రెస్ నేత శశిథరూర్ మంగళవారం అన్నారు. భారతదేశాన్ని సమైక్యంగా ఉంచగల ఏకైక పార్టీ కాంగ్రెసే అనే సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ యాత్ర సాగుతోందని తెలిపారు.
ఈ సందేశం ప్రజల్లోకి వెళ్తే పార్టీకి పునర్జీవం వస్తుందని అన్నారు.