
పంజాబ్ (punjab) రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ (Bhagwant Mann) బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. షహీద్ భగత్ సింగ్ నగర్ (Shaheed Bhagat Singh Nagar) జిల్లాలోని ఖట్కర్కలన్ (Khatkarkalan) లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఖట్కర్కలన్ ప్రాంతం స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ (Bhagat Singh) పూర్వీకుల గ్రామం. ఆ గ్రామంలో ప్రమాణస్వీకారోత్సవానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
చీఫ్ సెక్రటరీ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరకు అందరూ ఈ ప్రమాణ స్వీకార సన్నాహాకాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మొత్తం విస్తీర్ణంలో 50 ఎకరాలు మెయిన్ ఈవెంట్ కోసం రిజర్వ్ చేశారు. మిగిలిన ప్రాంతం పార్కింగ్ కోసం ఇతర అవసరాల కోసం ఉపయోగించనున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీఐపీ అతిథులను ఎవరినీ ఆహ్వానించలేదు.
ప్రమాణస్వీకారం నేపథ్యంలో పంజాబ్ ప్రజలను ఉద్దేశించి భగవంత్ మాన్ తన ట్విట్టర్ ద్వారా ఒక వీడియో విడుదల చేశారు. మార్చి 16వ తేదీన భగత్ సింగ్ కలను నెరవేర్చడానికి అందరం కలిసి పనిచేస్తామని అందులో తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడి దార్శనికతకు రూపాన్ని ఇస్తామని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రజల ప్రభుత్వమని ఆయన తెలిపారు. బుధవారం నాడు తాను మాత్రమే కాదని, తనతో పాటు పంజాబ్ లోని మూడు కోట్ల మంది ప్రజలు కూడా తనతో పాటు ప్రమాణం చేస్తారని చెప్పారు.
భగవంత్ మాన్ ఉదయం 10:00 గంటలకు తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని పంజాబ్ ప్రజలను ఆహ్వానించారు. వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చే ప్రజలు బసంతి రంగు తలపాగా లేదా కండువా ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal)
కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 117 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఘన విజయం సాధించింది. భగవంత్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit) తో ఆయన శనివారం సమావేశమై రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పత్రాలు అందించారు. కాగా శనివారం భగవంత్ మన్ తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన సంగ్రూర్ (Sangrur) లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. శిరోమణి అకాలీదళ్ (SAD) కేవలం మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. SAD కూటమి భాగస్వామి అయిన బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఒక స్థానాన్ని గెలుచుకోగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.