బెంగళూరు రేవ్ పార్టీ నిర్వహకుడు లంకపల్లి వాసు ఎవరో తెలుసా?... అతడి బ్యాగ్రౌండ్ ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. పోలీసుల దాడిలో పట్టుబడ్డవారిలో తెలుగువారే ఎక్కువగా వున్నట్లు... కొందరు సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది. పుట్టినరోజు వేడుకల ముసుగులో ఈ రేవ్ పార్టీ జరిగింది... ఇందులో భారీగా డ్రగ్స్ వినియోగం జరిగిందని బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే ఈ రేవ్ పార్టీతో ఒక్కసారిగా లంకపల్లి వాసు పేరు బయటకు వచ్చింది. దీంతో ఎవరీ వాసు? బ్యాగ్రౌండ్ ఏంటి? ఎందుకిలా కోట్లు పోసి రేవ్ పార్టీ ఏర్పాటు చేసాడు? అనే చర్చ తెలుగు ప్రజల్లో జరుగుతోంది.
ఇంతకీ ఎవరీ వాసు ?
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పాత్ర పోషించిన లంకపల్లి వాసు తెలుగోడే. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ అతడి స్వస్థలం. నిరుపేద కుటుంబంలో పుట్టిన వాసు కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివాడు. కానీ క్రికెట్ పై మక్కువతో మంచి క్రికెటర్ గా ఎదగాలని కలలు కనేవాడు. కానీ పేదరికం అతడి కలలు చిదిమేసి క్రికెట్ బుకీగా మార్చింది. ఒకప్పుడు ఆకలిబాధలు అనుభవించిన అతడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహణతో కోట్లకు పడగలెత్తాడు.
విజయవాడలోని ఆంజనేయవాగులో లంకపల్లి వాసు పుట్టి పెరిగాడు. అతడి చిన్నపుడే తండ్రి మరణించాడు... దీంతో తల్లి ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించేది. దోసెలు అమ్మి బిడ్డలను పోషించారు. ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్ గా మారారు. ఇలా వాసుతో పాటు ఇద్దరు ఆడబిడ్డల కోసం ఆ తల్లి ఎంతో కష్టపడింది. కొడుకును ప్రయోజకుడిని చేస్తే తన కష్టాలు తీరతాయని భావించింది. కానీ వాసు మాత్రం చదువును పక్కనబెట్టాడు... కేవలం పదో తరగతితోనే ముగించాడు.
చదువు అబ్బలేదు... పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు లేదు... మరి బ్రతకడం ఎలా అని ఆలోచించిన వాసుకి చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టపడుతున్న క్రికెట్ ఆదాయమార్గంగా కనిపించింది. చిన్నగా క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు... కొన్నాళ్లకు బుకీగా మారిపోయాడు. ఇలా విజయవాడలో ప్రారంభమైన అతడి చీకటి సామ్రాజ్యం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది. అంతేకాదు కేవలం క్రికెట్ మాత్రమే కాదు కబడ్డీ, హాకీ, ఫుట్ బాల్ ఇలా ప్రతి ఆటపై బెట్టింగ్ నిర్వహించేవాడు. దీంతో వాసు కోట్లకు పడగలెత్తాడు.
వాసు చీకటి సామ్రాజ్యం :
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన బుకీగా మారిన వాసు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు. దీంతో అతడి బెట్టింగ్ మాఫియాకు మరింత బలం వచ్చింది. వందలాది మందితో బెట్టింగ్ నెట్ వర్క్ ఏర్పాటుచేసుకున్నాడు. పోలీసులతో ఏదయినా ప్రాబ్లం వస్తే పొలిటికల్ పరిచయాలతో మ్యానేజ్ చేసేవాడు.
బెట్టింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తిన వాసు మరో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాడు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పబ్ లను ఏర్పాటుచేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి డ్రగ్స్ స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి.
వాసు లగ్జరీ జీవితం :
ఒకప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడు ఇప్పుడు కోట్ల విలువచేసే లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. విజయవాడ వీధుల్లో చిన్న ఇంటినుండి ఇప్పుడు లగ్జరీ ఇంటికి మారాడు. విమానాల్లో ప్రయాణం, విల్లాల్లో నివాసం... ఇప్పుడిది వాసు జీవితం.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌతిండియాలోని పలు రాష్ట్రాలకు తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు వాసు. ఇలా ప్రధాన బుకీగా మారిన అతడు భారీగా ఆస్తులు కూడబెట్టాడు. విజయవాడ, హైదరాబాద్ లోనే కాదు చాలాప్రాంతాల్లో అతడికి ఆస్తులున్నాయి.
విజయవాడ వైవీ రావు ఎస్టేట్ వద్ద ఏకంగా రూ.4 కోట్లు పెట్టి విల్లాను నిర్మించుకున్నాడు వాసు. కోట్ల విలువచేసే కార్లు అతడివద్ద వున్నారు.
ఇక వాసు పార్టీ ఇచ్చాడంటే మామూలుగా వుండదు. కోట్లు ఖర్చుచేసి తన భర్త్ డే పార్టీని చేసుకున్నాడంటేనే అతడి పార్టీలు ఏ స్థాయిలో వుంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకాలం గుట్టుగా సాగిన వాసు వ్యవహారం బెంగళూరు రేవ్ పార్టీతో బట్టబయలు అయ్యింది.