
Bengaluru Building Collapse: బెంగళూరులో వానలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాబుసాపాళ్య ప్రాంతంలో మంగళవారం నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది చిక్కుకుపోయారని సమాచారం. భారీ వర్షాలతో నిన్నటి నుంచి సాధారణ జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల మధ్య మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కూలిన సమయంలో భవనం లోపల ఉన్న కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలను ప్రారంభించడానికి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల విభాగాలను రంగంలోకి దించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భవన నిర్మాణ కార్మికులందరూ బీహార్‌కు చెందినవారు. నిర్మాణం కూలినప్పుడు వారందరూ కూడా 60x40 స్థలంలో పని చేస్తున్నారని సమాచారం.
అయితే, ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు తప్పించుకోగలిగారని సమాచారం. అయినప్పటికీ శిథిలాల కింద ఇంకా చిక్కుకున్న వారిని గుర్తించి వారికి సహాయం చేసేందుకు రెస్క్యూ టీమ్‌లు చురుకుగా పనిచేస్తున్నాయి. ఘటనా స్థలంలో ఉన్న అధికారులు పరిస్థితిని అంచనా వేయడం, రెస్క్యూ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు నవీకరణలను అందజేయడం కొనసాగిస్తున్నారు.
"పదిహేడు మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోయారు. వారి డెడ్ బాడీలను బయటకు తీశారు. అలాగే, ఇద్దరిని రక్షించారు. పద్నాలుగు మంది ఇంకా చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని" డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (తూర్పు) డీ దేవరాజు తెలిపారు. భవనం కూలిపోయిన వెంటనే రెస్క్యూ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయనీ, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు కార్మికులను గుర్తించి వారిని రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని కూడా తెలిపారు.
బెంగళూరు వర్షాలు
యెలహంక చుట్టుపక్కల అనేక ప్రాంతాలు జలమయం కావడంతో నార్త్ బెంగుళూరు వర్షాలకు అతలాకుతలమైంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె ప్రకారం.. యలహంకలో మంగళవారం అర్ధరాత్రి నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కేవలం ఆరు గంటల్లో 157 మిల్లి మీటర్ల వర్షం కురిసింది. యలహంకలోని కేంద్రీయ విహార్ నడుము లోతు నీటితో నదిని తలపిస్తోంది. రెస్క్యూ వర్కర్లు చిన్న పడవలను ఉపయోగించి ప్రజలను రక్షించారు. నీటి ఎద్దడి కారణంగా ఉత్తర బెంగళూరులో సాధారణ జనజీవనం స్తంభించింది. ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు.