ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025 భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా ఉండనున్నాయి. స్నైపర్లు, ఎన్ఎస్జీ కమాండోలు, ఏటీఎస్, ఎస్టీఎఫ్ సహా భారీ భద్రతా బలగాలను మోహరించనున్నారు.
ప్రయాగరాజ్ : ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక-ధార్మిక కార్యక్రమం ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 కోసం యోగి ప్రభుత్వం సన్నాహాలను వేగవంతం చేసింది. వచ్చే ఏడాది జనవరిలో మకర సంక్రాంతి నుండి ప్రారంభమయ్యే ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, దౌత్యవేత్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీని దృష్ట్యా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు.
మేళా ప్రాంతంలో భూ, జల, వాయు మార్గాల భద్రతను పటిష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం స్నైపర్లు, ఎన్ఎస్జీ కమాండోలు, కమాండో స్క్వాడ్, ఏటీఎస్, ఎస్టీఎఫ్, బీడీడీఎస్, స్నిఫర్ డాగ్‌లను మోహరించాలని నిర్ణయించింది.
undefined
మహా కుంభమేళా ఏర్పాట్లపై ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ... ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమే కాదు దేశ సంస్కృతి, సాంప్రదాయాలకు వేదికని అన్నారు. దేశ నలుమూలల నుండే కాదు విదేశాల నుండి కూడా పర్యాటకులు ఈ కుంభమేళాకు విచ్చేయనున్నారు.... దాదాపు 40 కోట్ల మంది భక్తులతో పాటు ప్రముఖులు వస్తారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నట్లు రాజేష్ ద్వివేది తెలిపారు.
ప్రయాగరాజ్ అంతటా, మేళా ప్రాంతం, ప్రధాన ప్రదేశాలు, దేవాలయాలు, సంగమం వద్ద ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. పలు దేశాల దౌత్యవేత్తలు ఈ కుంభమేళాలో పాల్గొంటారని ద్వివేది తెలిపారు. ఈ నేపథ్యంలో భద్రత చాలా కట్టుదిట్టంగా వుంటుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే యాంటీ డ్రోన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే మేళా ప్రాంతంలో పలు చోట్ల బుల్లెట్ ప్రూఫ్ చౌకీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ చౌకీలను మేళా ప్రాంతంలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ స్థలాలు,ప్రధాన దేవాలయాలు, ఇతర ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నట్లు ద్వివేది వెల్లడించారు.
ఇక ఎన్ఎస్జీ కమాండోల 2 బృందాలు, 26 ఏఎస్ చెక్ (యాంటీ సబోటాజ్) బృందాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. ఈ బృందాలు నగరం అంతటా తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. మేళా ప్రాంతంలో ఏటీఎస్ కమాండోల 4 బృందాలు, ఎస్టీఎఫ్ 3 బృందాలను మోహరిస్తామని ఎస్ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా బాంబుస్క్వాడ్, బీడీడీఎస్‌కు చెందిన 6 బృందాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు..
20 మంది స్నైపర్లు, 3 స్నిఫర్ డాగ్‌లు, 4 స్వాన్ బృందాల మోహరింపు
ప్రముఖ అతిథుల భద్రత కోసం 20 మంది స్నైపర్లు, 3 స్నిఫర్ డాగ్‌లు, 4 స్వాన్ బృందాలను మోహరిస్తామని ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు. దీంతో పాటు 30 మంది స్పాటర్ల బృందాలను కూడా మోహరిస్తామన్నారు. ఈ బృందాల సభ్యులు నగరం అంతటా మోహరించి, ప్రతి అనుమానితుడిపై, అల్లరిమూకలపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. అలాగే 9 కమాండో స్క్వాడ్ బృందాలతో అడుగడుగునా నిఘా ఉంచుతామని ద్వివేది వెల్లడించారు.
మహా కుంభమేళా సందర్భంగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు... ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఉత్తరాఖండ్ పిఏసికి చెందిన 2 బృందాలను సంగమం వద్ద మోహరిస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఉత్తరాఖండ్ పిఏసి బృందం నీటిలో జరిగే కార్యకలాపాలను సునిశితంగా అర్థం చేసుకుంటుంది... ఇందులో వారు చాలా నైపుణ్యం కలిగి ఉన్నారు కాబట్టే అక్కడ భద్రత బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ బృందంలో ఒక డీఎస్పీ, 4 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 35 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 65 మంది కానిస్టేబుళ్లు ఉంటారని ద్వివేది వెల్లడించారు.