
గుజరాత్ : గుజరాత్ లోని రాజకోట్ లో ఓ మైనర్ బాలికపై హత్యాచారం జరిగింది. 13 ఏళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన రాజ్కోట్ లో కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడింది 21యేళ్ల యువకుడిగా తేలింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. జూన్ 27వ తేదీన బాలిక కనిపించకుండాపోయింది. దీనిమీద మిస్సింగ్ కేసు నమోదు అయింది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు.
అతడు గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లాకు చెందిన జయదీప్ అలియాస్ జయు పర్మార్ గా గుర్తించారు. అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయం ఏంటంటే జయదీప్ భిక్షాటన చేస్తుంటాడు. అంతకుముందు జేబు దొంగతనాలకు కూడా పాల్పడిన నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. బాలిక మీద కన్నేసిన జయదీప్ ఆమె మేనమామతో పరిచయం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు,
తరచుగా అతనితో కలిసి బాలిక ఇంటికి వెళుతుండేవాడు. ఆమె దినచర్యను గమనిస్తుండేవాడు. జూన్ 27వ తేదీన కూడా బాలిక రోజులాగే కట్టెలు తీసుకురావడానికి బయలుదేరింది. దీన్ని నిందితుడు జయదీప్ గమనించాడు. ఆమెను వెంబడించి సమీపంలోని అజీ ఫ్యాక్టరీ లోకి లాక్కెళ్లాడు. అక్కడ ఉన్న ఒక రూమ్ లో బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలిక తన గురించి ఆమె కుటుంబ సభ్యులకు చెబుతుందని అనుమానించాడు.
దీంతో తాను దొరికిపోతానని భయపడి ఓ బరువైన వస్తువుతో బాలిక తల మీద మోదాడు. అలా పలుమార్లు కొట్టడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఇంకోవైపు కట్టెల కోసం వెళ్ళిన బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే చుట్టుపక్కల అంతా వెతికారు. దొరకకపోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు అజీ డ్యాం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయింది.
ఆ సమయంలో కూడా నిందితుడు జయదీప్ కుటుంబ సభ్యుల వెంటనే ఉన్నాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ సమయంలోనే తాను పట్టుబడతానేమో అనే భయం జయదీప్ ను పట్టుకుంది. అంతే అక్కడినుంచి పరారయ్యాడు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని గమనించిన పోలీసులకు నిందితుడు జయదీప్ అని అర్థమయింది.
వెంటనే అతని మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. అతను చెప్పిన వివరాల ప్రకారం బాలిక మృతదేహాన్ని లాక్ చేసి ఉన్న లాత్ మెషిన్ యూనిట్ సమీపంలో కనుగొన్నారు. బాలికకు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. బాలిక తండ్రి డ్రైవర్ గా పని చేస్తున్నాడు చిన్నారి స్వస్థలం రాజస్థాన్. కాగా కొద్ది సంవత్సరాల క్రితం రాజ్కోట్ కి వలస వచ్చి ఇక్కడే ఉంటున్నారు.