
దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గ్రామీణ భారతదేశ జీవనాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను రూపొందించాయని, వాటిని పంచాయతీలు పూర్తిగా క్షేత్ర స్థాయిలో పూర్తి అంకిత భావంతో అమలు చేస్తున్నాయని చెప్పారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అన్ని గ్రామసభలు, పంచాయతీరాజ్ సంస్థలను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు.
‘‘గ్రామీణ భారతదేశ జీవితాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం ఏ పథకాలను రూపొందించినా, వాటిని మన పంచాయతీలు పూర్తి అంకితభావంతో క్షేత్ర స్థాయిలో సాకారం చేస్తున్నాయి’’ అని ప్రధాని మోడీ తెలిపారు. 2014కు ముందు పంచాయతీలకు కేటాయించిన బడ్జెట్ రూ.17,000 కోట్లలోపే ఉండేదని ప్రధాని గుర్తు చేశారు. దానిని తమ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పెంచిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశాయని అన్నారు. తమ ప్రభుత్వం పంచాయతీలకు నిధులు పెంచిందని చెప్పారు.
ప్రధాని మోడీ పవర్ ప్యాక్డ్ పర్యటన సోమవారం మధ్యప్రదేశ్ లో ప్రారంభమైంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మధ్యప్రదేశ్ లోని రేవాలో పర్యటిస్తున్నారు. ప్రధాని వెంట ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోడీ ఈగ్రామ్ స్వరాజ్, జీఈఎమ్ పోర్టల్ ను ప్రారంభించారు. అలాగే రూ.17,000 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కాగా.. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం.. ఈగ్రామ్ స్వరాజ్ ప్లాట్ ఫామ్, జీఈఎమ్ లను ను ఉపయోగించి పంచాయతీలు పలు వస్తువులు, సేవలు కొనుగోలు చేయవచ్చు.