మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని బహిరంగంగా స్క్రీనింగ్ వేసిన కాంగ్రెస్.. కేరళలోని బీచ్‌లో నిర్వహణ

By Mahesh KFirst Published Jan 26, 2023, 10:57 PM IST
Highlights

మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని కేరళ కాంగ్రెస్ యూనిట్ బహిరంగంగా ఓ బీచ్‌లో స్క్రీనింగ్ చేసింది. తిరువనంతపురంలోని బీచ్‌లో ఈ రోజు సాయంత్రం స్క్రీనింగ్ వేసింది. కేరళలోని కాంగ్రెస్ యూనిట్‌లోనే ఈ డాక్యు సిరీస్ పై భిన్నాభిప్రాయాలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం.
 

తిరువనంతపురం: గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీపై బ్రిటన్‌కు చెందిన బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది. ఈ డాక్యు సిరీస్‌ను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు విషయాలను చెబుతున్నదని, ప్రాపగాండ సిరీస్ అని కేంద్రం కొట్టివేసింది. అంతేకాదు, ఈ డాక్యు సిరీస్ విడుదల కాగానే యూట్యూబ్, ట్విట్టర్‌లకు వీడియో లింక్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టు కొన్ని వర్గాలు చెప్పాయి. కానీ, ప్రతిపక్షాలు, కొన్ని యూనివర్సిటీల్లోని స్టూడెంట్ యూనియన్లు ఈ బీబీసీ డాక్యుమెంటరీని స్క్రీనింగ్ వేశాయి. ఇవన్నీ క్లోజ్‌డ్ ఏరియాలో జరిగాయి. కానీ, కేరళలోని కాంగ్రెస్ యూనిట్ ఏకంగా ఈ డాక్యుమెంటరీని బహిరంగంగా తిరువనంతపురంలోని శంగుముఘమ్ బీచ్‌లో ఈ రోజు సాయంత్రం స్క్రీనింగ్ వేసింది. చాలా మంది ఆ డాక్యు సిరీస్ చూసేలా ఏర్పాట్లు చేసింది.

కేరళలో బీబీసీ డాక్యుమెంటరీ విషయమై కాంగ్రెస్ యూనిట్‌లోనే వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ సీనియర్ కాంగ్రెస్ లీడర్,  కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ పార్టీ వైఖరికి భిన్నంగా ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. దేశ వ్యవస్థలను కాదని బీబీసీ డాక్యుమెంటరీని సపోర్ట్ చేయడం దేశ సార్వభౌమత్వాన్ని తక్కువ చేయడమే అవుతుందని, ఇది ప్రమాదకర పరిణామాలకు దారి తీయవచ్చని ఆయన ట్వీట్ చేశారు. అనంతరం, కాంగ్రెస్ నేతలు ఆ ట్వీట్ తొలగించాలని అతడిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీంతో ఆయన ఏకంగా పార్టీ నుంచే తప్పుకున్నారు.

Also Read: గోద్రా అనంతర అల్లర్ల కేసు.. సాక్ష్యాలు లేకపోవడంతో 22 మంది నిందితులను నిర్దోషులుగా తేల్చిన గుజరాత్ కోర్టు..

కాగా, అనిల్ కే ఆంటోనీ వాదనలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందించారు. అనిల్ కే ఆంటోనీ వాదన ఇమ్మెచ్యూర్‌గా ఉన్నదని, ఒక డాక్యుమెంటరీతో ప్రభావితమయ్యేంత బలహీనంగా మన దేశ భద్రత, సార్వభౌమత్వం ఉన్నదా? అని ప్రశ్నించారు.

జమ్ములో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ బీబీసీ డాక్యుమెంటరీ విషయమై కేంద్రంపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ సెన్సార్షిప్‌ను ప్రశ్నించారు. నిజం నిప్పు కణికలా వెలుగుతుందని, ఎప్పటికైనా బయటికి వచ్చే ఓ చెడ్డ అలవాటు దానికి ఉన్నదని అన్నారు. కాబట్టి, బ్యాన్‌లు, ఒత్తిడులు, అణచివేతలు ఎంత స్థాయిలో ప్రయోగించినా వాస్తవం ప్రజల వద్దకు రాకుండా ఆపలేరు అని పేర్కొన్నారు.  కాంగ్రెస్ నేత రాహుల్ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

click me!