
2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి నిరసనల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పశ్చిమ బెంగాల్ లో ప్రత్యక్షమయ్యాడు. 24 పరగణాలు జిల్లాలోని కాక్‌ద్వీప్‌లో ఓటుహక్కును కలిగివున్నాడు. ఇలా బంగ్లాదేశ్ నిరసనలో పాల్గొన్నవ్యక్తి ఓటు హక్కు కలిగివుండటం వివాదంగా మారింది.
న్యూటన్ దాస్ అనే వ్యక్తి 2024 బంగ్లాదేశ్ లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న చిత్రాలు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి. ఈ నిరసనలు బంగ్లాదేశ్ లో పాలన మార్పుకు కారణమయ్యాయి… ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి తొలగించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ న్యూటన్ దాస్ వ్యవహారంతో దేశంలోకి అక్రమ చొరబాట్లు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై బిజెపి-టిఎంసి మధ్య తీవ్రమైన ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసింది.
అయితే తనది భారతదేశమేనని… అనుకోకుండా బంగ్లాదేశ్ నిరసనల్లో చిక్కుకున్నానని న్యూటన్ దాస్ తెలిపాడు. దాస్ భారతీయ పౌరసత్వాన్ని క్లెయిమ్ చేస్తూ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్‌తో సహా పత్రాలను సమర్పించారు.
“మా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యల పరిష్కారం కోసం 2024లో నేను బంగ్లాదేశ్‌కు వెళ్లాను. కానీ అనుకోకుండా అక్కడ విప్లవంలో చిక్కుకున్నాను. నేను 2014 నుండి కాక్‌ద్వీప్‌లో ఓటరుగా ఉన్నాను. 2017లో నా ఓటరు కార్డు పోయినప్పటికీ స్థానిక MLA మన్తురాం పఖీరా సహాయంతో మరుసటి సంవత్సరం కొత్తది పొందగలిగాను. 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఓటు కూడా వేశాను” అని దాస్ ఒక వీడియో సందేశంలో చెప్పారు. అయితే అతను భారతదేశంలో నివసిస్తున్నాడా లేక బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నాడా అనేది స్పష్టం చేయలేదు.
మరోవైపు దాస్ బంధువు తపన్ కాక్‌ద్వీప్‌లోని విలేకరులతో మాట్లాడుతూ.. న్యూటన్ “బంగ్లాదేశ్‌లో జన్మించాడు, రెండు దేశాల్లో ఓటు హక్కును వినియోగిస్తున్నాడు” అని అన్నారు.
“నియుటన్ బంగ్లాదేశ్‌లో జన్మించాడు, రెండు దేశాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నాడు. కరోనా తర్వాత కొంత పూర్వీకుల భూమిని అమ్మడానికి భారతదేశానికి వచ్చి అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాడు. రెండు చోట్లా ఓటరుగా నమోదు చేసుకున్నందుకు అతనే బాధ్యత వహించాలి, అది సరికాదు” అని తపన్ దాస్ అన్నారు.
ఎన్నికల ఫలితాలను మార్చడానికి టిఎంపి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని బిజెపి ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంతా మజుందార్ సోషల్ మీడియా పోస్ట్‌లో న్యూటన్ దాస్ వ్యవహారాన్ని బంగ్లా మోడల్ కు మరో ఉదాహరణగా అభివర్ణించారు.
‘’బంగ్లాదేశ్‌లోని కోటా సంస్కరణ ఉద్యమంలో కర్ర ఊపుతూ కనిపించిన అదే న్యూటన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని కాక్‌ద్వీప్‌లో ఓటరు. టిఎంసి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ అక్రమ చొరబాట్ల నెట్‌వర్క్‌కు ఆజ్యం పోస్తున్నారు” అని ఆయన అన్నారు.
“లక్షలాది మంది బంగ్లాదేశ్ జాతీయులు పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లుగా నమోదయ్యారు” అని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆరోపించారు. “పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాలో చోటు సంపాదించుకున్న లక్షలాది మంది బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నారు. అన్సారుల్లా బంగ్లా టీమ్‌లో అనుమానిత సభ్యుడైన సాద్ షేక్ విషయం తీసుకోండి, అతని పేరు ముర్షిదాబాద్ ఓటర్ల జాబితాలో ఉంది” అని ఆయన అన్నారు.
“తృనమూల్ కాంగ్రెస్ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు భారతదేశంలోకి ప్రవేశించడానికి చురుకుగా సహాయం చేస్తోంది. వారిలో చాలా మంది జిహాదీలు ఉంటున్నారు. వారికి ఓటరు కార్డులు, పౌరసత్వం కూడా ఇస్తున్నారు. అధికారాన్ని కాపాడుకునేందుకే టిఎంసి ఇదంతా చేస్తుంది'' అని బిజెపి మథురపుర్ ఆర్గనైజేషనల్ జిల్లా కార్యదర్శి సంజయ్ దాస్ ఆరోపించారు.
దీనికి ప్రతిస్పందనగా TMC ఆరోపణలను తోసిపుచ్చింది. భారత-బంగ్లాదేశ్ సరిహద్దును కాపలా కాసే కేంద్రం, సరిహద్దు భద్రతా దళం (BSF)పై నిందలు వేసింది. “సరిహద్దులను కాపలా కాసే బాధ్యత కేంద్రం, BSFదే. మా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్ర పోషిస్తుంది, కానీ భద్రతను నిర్ధారించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత” అని TMC ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.
వైరల్ అయిన పుట్టినరోజు పార్టీ ఫోటోలో తనతో కేక్ కట్ చేస్తున్నట్లు కనిపించిన న్యూటన్్ దాస్‌తో తనకున్న సంబంధాన్ని TMC సుందర్బన్స్ ఆర్గనైజేషనల్ జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు దేబాషిస్ దాస్ స్పష్టం చేశారు.
“అతను బంగ్లాదేశ్ నిరసనల్లో పాల్గొన్నాడని నాకు తెలియదు. చాలా మంది వ్యక్తులు ఉన్న పుట్టినరోజు వేడుకలో ఆ ఫోటో తీయబడింది. అతని లాంటి వ్యక్తి సరిహద్దు దాటితే, BSF సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడమే ఇలాంటి సంఘటనలను నివారించడానికి ఏకైక మార్గం. అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను” అని ఆయన అన్నారు.