గోద్రా రైలు దహనం కేసు.. దోషులకు బెయిల్ ఇవ్వొద్దు : సుప్రీంకు గుజరాత్ సర్కార్ వినతి

By Siva KodatiFirst Published Dec 3, 2022, 6:41 PM IST
Highlights

గోద్రా రైలు దహనం కేసులో దోషులకు బెయిల్ ఇవ్వొద్దని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌కి విజ్ఞప్తి చేసింది. వీరు చేసిన రాళ్ల దాడి వల్లే నాటి ఘటనలో ప్రయాణీకులు రైలు బోగీలోంచి బయటకు రాలేకపోయారని తెలిపింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోద్రా రైలు దహనం కేసులో పలువురి పిటిషన్లను వ్యతిరేకిస్తూ.. గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్ట్‌లో సవాల్ చేసింది. వాళ్లు రాళ్లదాడికి పాల్పడటం వల్లే కోచ్ నుంచి ప్రయాణికులు తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వం తరపు న్యాయవాది తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో ఎస్ 6 బోగీలోని 59 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు తమకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వీరు ఇప్పటికే 17 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన నేపథ్యంలో పిటిషన్లను పరిగణనలోనికి తీసుకోవచ్చని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే వారి వ్యక్తిగత వివరాలపై గుజరాత్ ప్రభుత్వం నుంచి వివరణ కోరడంతో.. రాష్ట్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 

ALso Read: గ్యాంగ్ రేప్ నిందితుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

భీకర రాళ్ల దాడి కారణంగానే బోగీలోని ప్రయాణీకులు బయటకు రాలేక అగ్నికి ఆహుతయ్యారని తుషార్ తెలిపారు. అలాగే దోషుల బెయిల్ పిటిషన్లు 2017 అక్టోబర్‌లో గుజరాత్ హైకోర్ట్ తీర్పునకు వ్యతిరేకంగా వున్నాయని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. 

click me!